Foldable Iphone| ఆపిల్ కంపెనీ త్వరలో ఫోల్డెబుల్ ఐఫోన్‌ను విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ గురించి ఆపిల్ ఇంతవరకు ఎలాంటి సమాచారం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఒక నివేదిక ప్రకారం.. ఈ ఫోల్డబుల్ ఫోన్ ఇప్పుడు ప్రారంభ తయారీ దశలో ఉంది. 2025 చివరి నాటికి ఈ ఫోన్ ప్రోటోటైప్ టెస్టింగ్ పూర్తి చేసి.. ఇంజనీరింగ్ వెరిఫికేషన్ టెస్ట్ (EVT) దశకు చేరుకుంటుందని అంచనా. ఈ ఫోల్డబుల్ ఐఫోన్ 2026 సంవత్సరం రెండవ భాగంలో విడుదల కావచ్చని సమాచారం.
డిజిటైమ్స్ అనే పత్రిక, సప్లై చైన్ వర్గాల సమాచారం ఆధారంగా ప్రచురించిన కథనంప్రకారం.. ఈ ఫోల్డెబుల్ ఐఫోన్ జూన్ నెలలో ప్రోటోటైప్ (P1) దశకు చేరినట్లు తెలిపింది. ఆపిల్ తన ఫోన్‌ల తయారీలో సాధారణంగా అనుసరించే ప్రక్రియను ఈ ఫోల్డెబుల్ ఫోన్ కోసం కూడా అమలు చేస్తోంది. ఈ ఫోన్ P1 నుండి P3 వరకు మూడు ప్రోటోటైప్ దశలను దాటి, EVT దశకు చేరుకుంటుంది. ఆ తర్వాత, ఉత్పత్తి పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. దీని ఫలితంగా.. 2026 జులై తరువాతే ఈ ఫోన్ మార్కెట్లోకి రావచ్చు.
ప్రతి ప్రోటోటైప్ దశ దాదాపు రెండు నెలలు పడుతుందని తెలుస్తోంది. ఈ సమయంలో, ఆపిల్‌తో కలిసి పనిచేసే సప్లై చైన్ భాగస్వాములు పరిమితమైన ట్రయల్ ఉత్పత్తిని నిర్వహిస్తారు. ఈ ట్రయల్స్ పూర్తయిన తర్వాత.. ఐఫోన్ అసెంబ్లర్లు అయిన ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ ఉత్పత్తి నాణ్యతను పరిశీలించి, తయారీ సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఆ తర్వాతే పూర్తి స్థాయి ఉత్పత్తి మొదలవుతుంది.
ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ ప్రారంభ షిప్‌మెంట్ అంచనా దాదాపు 70 లక్షల యూనిట్లుగా ఉంది. అయితే, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఈ సంఖ్య మారవచ్చు. అంతేకాకుండా, ఆపిల్ ఒక ఫోల్డబుల్ ఐప్యాడ్‌ను కూడా అభివృద్ధి చేస్తోందని వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్లాన్‌ను ప్రస్తుతం నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేల తయారీలో సవాళ్లు, అధిక ఉత్పత్తి ఖర్చులు, పెద్ద ఫోల్డెబుల్ డివైస్‌లకు మార్కెట్ డిమాండ్ తక్కువగా ఉండటం దీనికి కారణాలుగా చెబుతున్నారు.
ఆపిల్ ఫోల్డెబుల్ ఐఫోన్ మార్కెట్లోకి రావడం వల్ల ఫోల్డెబుల్ ఫోన్ సెగ్మెంట్‌లో పోటీ మరింత ఉధృతం కానుంది. ఈ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్, ఇతర చైనీస్ ఫోల్డబుల్ ఫోన్‌లతో పోటీ పడనుంది.
Also Read: మీ వద్ద పాత ఐఫోన్‌లు ఉన్నాయా? ఈ మోడల్స్‌కు కోట్లలో రిసేల్ విలువ!
ఈ ఫోల్డబుల్ ఐఫోన్ ధర అమెరికాలో సుమారు $2,300 (సుమారు రూ. 1,99,000)గా ఉండవచ్చని అంచనా. ఇది లిక్విడ్ మెటల్ హింజ్‌ను కలిగి ఉంటుందని, 7.8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 5.5 అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ ఫోన్ మడతపెట్టినప్పుడు 9.2 మిల్లీమీటర్ల మందం, విప్పినప్పుడు 4.6 మిల్లీమీటర్ల మందంతో ఉంటుందని, సైడ్‌లో టచ్ ఐడీ సెన్సార్‌ను కలిగి ఉంటుందని సమాచారం.