ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరం అయిన నేపథ్యంలో టెహ్రాన్ తన పౌరులకు కీలక సూచనలు చేసింది. ప్రజలు సేఫ్ గా ఉండేందుకు కీలక సూచనలు చేసింది. అందులో భాగంగానే తమ పౌరులు వెంటనే వాట్సాప్ ను డిలీట్ చేయాలన్నారు. ఇజ్రాయెల్ కోసం ఆ యాప్ సమాచారాన్ని సేకరిస్తోందని ఆరోపించింది. ఈ విషయాన్ని ఇరాన్ స్టేట్ టెలివిజన్ అధికారికంగా ప్రకటించింది. ప్రజలు సేఫ్ గా ఉండాలంటే ఈ పని వెంటనే చేయాలని సూచించింది.
ఇంకా వాట్సాప్ ఏం చెప్పిందంటే?
ఈ ఆరోపణలను వాట్సాప్ తీవ్రంగా ఖండించింది. ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ ను ఉపయోగించడాన్ని నొక్కి చెప్పింది. వినియోగదారుల గోప్యతకు ఏమాత్రం భంగం కలిగించే ప్రయత్నం చేయమని తేల్చి చెప్పింది. ప్రభుత్వాలతో, సంస్థలతో వాట్సాప్ కు సంబంధించి డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ అందించే అవకాశం లేదని తేల్చి చెప్పింది. “ఇవి తప్పుడు నివేదికలు. ఇలాంటి నివేదికల కారణంగా ప్రజలకు అత్యంత అవసరమైన సమయంలో మా సేవలను పొందే అవకాశం ఉండదు. ఫలితంగా వాళ్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంది” అని వాట్సాప్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తుందని.. వినియోగదారుల డేటాను ఎవరితో పంచుకోదని పునరుద్ఘాటించింది వాట్సాప్. “మేము మీ కచ్చితమైన స్థానాన్ని ట్రాక్ చేయము. ప్రతి ఒక్కరూ మెసేజ్ పంపుతున్న లాగ్ లను మేం ఉంచం. ప్రజలు ఒకరికొకరు పంపుతున్న వ్యక్తిగత సందేశాలను మేము ట్రాక్ చేయము. మేము ఏ ప్రభుత్వానికి బల్క్ సమాచారాన్ని అందించము. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా మెసేజ్ పంపినవారు, పొందిన వాళ్లు తప్ప మరెవరూ ఈ మెసేజ్ లను చదవలేరు. ఒకవేళ ఎవరైనా చదవడానికి ప్రయత్నించిన మెసేజ్ లు అర్థం కాని టెక్స్ట్‌గా కనిపిస్తాయి. వీటిని సరైన కీ లేకుండా డీకోడ్ చేయలేము” అని తెలిపింది.
అమెరికన్ యాప్స్ పై ఇరాన్ నిఘా
గత కొంత కాలంగా ఇరాన్ వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ల వినియోగాన్ని పరిమితం చేసింది. అయితే, చాలా మంది ప్రజలు ప్రాక్సీలు, VPNలను ఉపయోగించి ఈ పరిమితులను అధిగమించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. 2022లో మోరల్ పోలీస్ కారణంగా ఒక మహిళ మరణించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ సమయంలోనే ఇరాన్ ప్రభుత్వం WhatsApp, Google Playలను బ్లాక్ చేసింది. ఈ పరిమితులు 2023 చివరిలో ఎత్తివేయబడ్డాయి. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో ఇరాన్ మరోసారి తమ పౌరులకు ఈ యాప్ ను డిలీట్ చేయాలని సూచించింది. ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్ లతో పాటు WhatsApp ను ఇరాన్ లో అత్యంత ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఇరత దేశాల మాదిరిగానే వ్యక్తిగత, అధికారిక సమాచారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాప్ తో ఇప్పుడు తమ పౌరులకు ముప్పు ఉందని ఇరాన్ భావిస్తోంది.
Read Also: ఆహా.. ఆ దేశంలో అందరికీ ఫ్రీ జర్నీ.. బస్సుల్లోనే కాదు, రైళ్లలో కూడా!