Glowing Skin Mistakes| ఆరోగ్యవంతమైన అందమైన చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. ఇందుకోసం సన్‌స్క్రీన్‌ను రోజూ ఉపయోగించడం చాలా అవసరం. కానీ చాలామంది దీన్ని రొటీన్‌గా పాటించరు. ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఎండలు లేనప్పుడు సన్‌స్క్రీన్ అవసరం లేదని చాలామంది భావిస్తారు. ఇలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది. దీనివల్ల టానింగ్, నల్లని మచ్చలు, చర్మ రంగులో అసమానతలు, ముఖంపై గీతలు పడి చర్మ రక్షణ పొర దెబ్బతింటుంది. ఇవన్నీ అందరూ చేసే చిన్న చిన్న తప్పుల వల్ల జరుగుతాయి. ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకొని వాటిని ఎలా సరిచేయలాలో చూద్దాం.
తప్పు 1: మెలనిన్ రక్షణ సరిపోతుందని భావించడం
చర్మ వైద్య నిపుణురాలు.. డాక్టర్ దివ్‌నీత్ కౌర్ మెలనిన్ సమస్య గురించి మాట్లాడుతూ.. భారతీయుల చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది సహజంగా SPF 13 స్థాయి రక్షణను ఇస్తుంది. కానీ, UV కిరణాలు హైపర్‌పిగ్మెంటేషన్‌కు కారణమవుతాయి. వృద్ధాప్య గుర్తులను వేగవంతం చేస్తాయి. మెలాస్మా ఉన్నవారికి ఎక్కువ నష్టం కలిగిస్తాయి.
సరైన విధానం: ప్రతి ఉదయం ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా, కనీసం SPF 30 ఉన్న బ్రాడ్-స్పెక్ట్రం సన్‌స్క్రీన్‌ను రాయండి. తెల్లటి మచ్చ లేని సన్‌స్క్రీన్‌ను ఎంచుకోండి.
తప్పు 2: వర్షాకాలం, చలికాలం రోజుల్లో లేదా ఇంట్లో ఉన్నప్పుడు సన్‌స్క్రీన్ వాడకపోవడం
సూర్యుడి నుంచి వచ్చే UVA కిరణాలు మేఘాలు, గాజు కిటికీల గుండా చొచ్చుకొని మరీ చర్మాన్ని దెబ్బతీయగలవు. ఇవి వృద్ధాప్యం, పిగ్మెంటేషన్‌కు కారణమవుతాయి.
సరైన విధానం: కిటికీ దగ్గర కూర్చున్నా లేదా బయట పనులు చేస్తున్నా, తేలికైన, జిడ్డు లేని సన్‌స్క్రీన్‌ను ఉపయోగించండి. ఇది మేకప్‌కు కూడా మంచి బేస్‌గా పనిచేస్తుంది. ఎయిర్‌కండిషన్ గదుల నుండి బయటకు వెళ్లినప్పుడు మళ్లీ రాయండి.
తప్పు 3: సన్‌స్క్రీన్‌ను ఒక్కసారి మాత్రమే రాయడం
చాలామంది ఉదయం ఒక్కసారి సన్‌స్క్రీన్ రాస్తే సరిపోతుందని భావిస్తారు.
ఎందుకు: చెమట, చర్మంలోని నూనె, బట్టలతో రాపిడి వల్ల సన్‌స్క్రీన్ రక్షణ కొన్ని గంటల్లోనే తగ్గిపోతుంది. వేడి, తేమ, కాలుష్యం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తాయి.
సరైన విధానం: బయట ఉన్నప్పుడు ప్రతి 3-4 గంటలకు సన్‌స్క్రీన్‌ను మళ్లీ రాయండి. మేకప్ ఉన్నప్పుడు, ముందు బ్లాటింగ్ పేపర్ లేదా కాంపాక్ట్‌తో నూనెను తొలగించి, మాట్ ఫినిష్ గల జెల్ ఆధారిత సన్‌స్క్రీన్ రాయండి. ఇది మేకప్‌ను పాడు చేయదు మరియు జిడ్డుగా అనిపించదు.
తప్పు 4: మన వాతావరణానికి సరిపడని సన్‌స్క్రీన్ ఉపయోగించడం
చాలా జిడ్డుగా, గట్టిగా ఉండే సన్‌స్క్రీన్‌లు చర్మ రంధ్రాలను బ్లాక్ చేస్తాయి. ఇవి ఆయిలీ స్కిన్ ఉండేవారికి హాని కలిగిస్తాయి.
సరైన విధానం: నాన్-కామెడోజెనిక్, సుగంధ రహిత, చెమటకు నిరోధకమైన జెల్ లేదా ఫ్లూయిడ్ టెక్స్చర్ గల సన్‌స్క్రీన్‌లను ఎంచుకోండి. ఇవి తేలికగా, త్వరగా శోషించబడతాయి. వేడి, తేమ ఉన్న నగర వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి.
Also Read: విటమిన్ డి కోసం ఎండలో ఎంతసేపు ఉండాలి.. నిపుణుల సమాధానమిదే
తప్పు 5: SPF ఉన్న మేకప్‌పై మాత్రమే ఆధారపడటం
SPF ఉన్న మేకప్ పూర్తి రక్షణ ఇవ్వదు, ఎందుకంటే అందుకు సిఫార్సు చేసిన దానికంటే ఏడు రెట్లు ఎక్కువ మేకప్ రాయాలి.
సరైన విధానం: మేకప్ రాయడానికి ముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ను ఉపయోగించండి. మేకప్ అదనపు రక్షణను ఇస్తుంది కానీ ఏకైక రక్షణ కాదు.
సూర్యకాంతి నష్టం క్రమంగా పేరుకుపోతుంది, దాని గుర్తులు స్పష్టంగా కనిపించవు. రోజూ సన్‌స్క్రీన్ రాయడం మీ చర్మానికి ఉత్తమ రక్షణ. మీకు నచ్చిన సన్‌స్క్రీన్‌ను ఎంచుకుని, ఉదయం రొటీన్‌గా రాయడంతో పాటు, సులభంగా ప్రతి రోజు రెండు సార్లు అప్లై చేయడం అలవాటు చేసుకోవాలి.