BIG TV LIVE Originals: ప్రపంచ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ అత్యాధునికంగా మారిపోతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రోజు రోజు దూసుకెళ్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల నుంచి గంటకు వందల కిలో మీటర్లు ప్రయాణించే బుల్లెట్ రైళ్ల వరకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రజల ప్రయాణ సమయాన్ని గణీయంగా తగ్గిస్తున్నాయి. అయితే, ఏ దేశంలోనైనా బస్సులు, రైళ్లలో ప్రయాణించాలంటే కచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఓ దేశంలో మాత్రం ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. స్థానికులే కాదు, టూరిస్టులు కూడా అక్కడి బస్సులు, రైళ్లలో ఫ్రీగా వెళ్లవచ్చు.
లక్సెంబర్గ్ లో ఉచిత రవాణా వ్యవస్థ
ప్రపంచంలో ఉచితంగా బస్సు, రైలు ప్రయాణాన్ని అందిస్తున్న ఏకైక దేశం లక్సెంబర్గ్. ప్రపంచంలో ఒకే ఒక్క దేశం తమ పౌరులతో పాటు పర్యాటకుల కోసం ఉచితంగా బస్సులు, రైళ్లు నడుపుతున్నది. ఇందులో ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. చేతిలో చిల్లిగవ్వ లేకకపోయినా నచ్చిన చోటుకి చేరుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అనే మాట అనేది వినిపించదు.
యూరోపియన్ యూనియన్ లో అత్యంత రిచ్ కంట్రీ
లక్సెంబర్గ్ యూరప్ ఖండంలోని ఓ భాగం. సంపదకు ప్రసిద్ధి చెందిన దేశం. యూరోపియన్ యూనియన్ లో అత్యధిక జీడీపీ కలిగి ఉన్న దేశం. ఈయూ తలసరి ఆదాయం సగటున 37,600 యూరోలు ఉంటే, ఈ దేశ తలసరి ఆదాయం 89, 800 యూరోలుగా ఉంది. ఇది ఈయూ సగటు కంటే చాలా ఎక్కువ. అంతేకాదు, ఇది ఈయూ మొత్తం GDPలో 0.5% వాటా కలిగి ఉంది. 2024లో IMF ద్వారా ప్రపంచంలోనే అత్యధిక తలసరి జీడీపీ కలిగి ఉన్న దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. లక్సెంబర్గ్ బ్యాంకింగ్, పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చెందింది. 2019 మెర్సర్ ప్రపంచ వ్యాప్తంగా 231 నగరాలపై నిర్వహించిన సర్వేలో, ఈ దేశం వ్యక్తిగత భద్రత విషయంలో మొదటి స్థానంలో నిలిచింది. జీవన నాణ్యత విషయంలో 18వ స్థానంలో నిలిచింది.
2020 నుంచి ఉచిత ప్రయాణం అమలు
సంపద పరంగా ఉన్నతంగా ఉండటంతో లక్సెంబర్గ్ దేశం తమ పౌరులకు ఉచిత బస్సు, రైలు ప్రయాణాలను అందించాలని నిర్ణయించింది. 2020 సంవత్సరం నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దేశంలో కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఉచిత బస్సు, రైలు సౌకర్యాన్ని ప్రజలకు పరిచయం చేసింది. ప్రజలంతా ప్రజా రవాణాను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆ దేశంలోకి మెజారిటీ ప్రజలు ప్రభుత్వ ఉచిత రవాణా వ్యవస్థలను వినియోగించుకుంటున్నారు. లక్సెంబర్గ్ చూడ్డానికి వచ్చిన విదేశీ పర్యాటకులు కూడా అక్కడ ఉచితంగానే ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఎవరూ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: ఇక స్లీపర్ కోచ్ లోనూ ఏసీ బోగి సదుపాయాలు.. రైల్వే గ్రీన్ సిగ్నల్!