CM Revanth Reddy : గూగుల్ ఒక ఇన్నోవేటివ్ కంపెనీ అయితే.. మాది ఒక ఇన్నోవేటివ్ ప్రభుత్వం అని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. గూగుల్ అండ్ హైదరాబాద్ సిటీ.. పాత స్నేహితులు అని చెప్పారు. విద్య, భద్రత, మ్యాప్‌లు, ట్రాఫిక్, స్టార్టప్‌లు, ఆరోగ్యం ఇలా అనేక రంగాలలో గూగుల్‌తో కలిసి తాము పనిచేస్తున్నామని అన్నారు. 2007లో కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌లో గూగుల్ తన మొదటి కార్యాలయం ఏర్పాటు చేసిందని.. ప్రస్తుతం 7 వేల మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పుకొచ్చారు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
గూగుల్‌లో ఇలా సెర్చ్ చేస్తే..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడి అనుకూల రాష్ట్రం కోసం సెర్చ్ చేస్తే.. దానికి సమాధానంగా తెలంగాణ అని వస్తుందని చెప్పారు. గూగుల్ సెర్చ్‌లో మొదటి లింక్ హైదరాబాద్ అని వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. దీనిని తాము తెలంగాణ రైజింగ్ అని పిలుస్తామని.. 2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నామని తెలిపారు.
గూగుల్ గేమ్ ఛేంజర్
గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయిందని.. మన జీవితాలు పూర్తిగా డిజిటల్ మయం అయ్యాయని సీఎం చెప్పారు. డిజిటల్ రంగం సురక్షితంగా ఉంటేనే మనం మరింత అభివృద్ధి చెందుతామని అన్నారు. గోప్యత, భద్రత గురించి ఆందోళన చెందుతున్నామని.. అధునాతన సైబర్ సెక్యూరిటీ, భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ సైబర్ సెక్యూరిటీ హబ్‌ను ఏర్పాటు చేయడం బాగుందన్నారు. ఇది నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పనతో పాటు దేశ సైబర్ భద్రతా సామర్థ్యాన్ని సైతం పెంచుతుందని చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి.
గూగుల్ సపోర్ట్ కావాలి..
చెడు చేయవద్దనే గూగుల్ సంస్థ సిద్ధాంతాన్ని తాను ఇష్టపడుతున్నానని.. తమ ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. గూగుల్ ఆఫీస్ పక్కనే రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశాం అన్నారు. యువతలో నైపుణ్యాలు పెంచడంతో పాటు వారికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నామని.. దీనికి గూగుల్ మద్దతు కావాలని కోరారు. తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్నా మన్నారు.
యంగ్ ఇండియా కోసం..
నాణ్యమైన విద్య కోసం యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకువస్తున్నాం.. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం.. అని చెప్పారు సీఎం.
కలిసి పని చేద్దాం..
గూగుల్ లాగానే.. ప్రభుత్వంలో భాగస్వాములైన మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. గూగుల్, తెలంగాణ ప్రభుత్వం కలిసి గొప్ప ప్రమాణాలను సృష్టిద్దామని పిలుపు ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
Proud to share that #Hyderabad is now home to the Google Safety Engineering Centre (GSEC) from today. After I inaugurated it today morning, along with my Cabinet colleague and IT minister D. Sridhar Babu garu, and MP Mallu Ravi garu, the GSES is the first in Asia Pacific region,… pic.twitter.com/LTiHqe47c5
— Revanth Reddy (@revanth_anumula) June 18, 2025