ఖగోళంలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు నిర్వహించినా, తెలుసుకున్నది కేవలం గోరంతే. తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. సౌర కుటుంబం గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం భూమితో పోల్చితే, చంద్రుడి మీద ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? అక్కడ మనిషి తట్టుకోగలడా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
చంద్రుడు భూమికి ఉపగ్రహం. భూమితో పోల్చితే చంద్రుడి మీద పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. భూమి, చంద్రుడికి సూర్యుడు సమానం దూరంలో ఉంటాడు. అయితే, భూమితో పోల్చితే చంద్రుడి మీద ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. సూర్యకాంతి చంద్రుడి మీద పడినప్పుడు దాని ఉపరితలం నుంచి వచ్చే పరావర్తనం కాంతి మనకు వెన్నెల మాదిరిగా కనపడుతుంది. అయితే, సూర్యుడి ఉష్ణోగ్రత భూమ్మీద పడినట్లుగానే చంద్రుడి మీద పడినప్పటికీ.. అక్కడ త్వరగా చల్లబడుతుందని మిచిగాన్ యూనివర్సిటీ ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ జాన్ మోనియర్ వెల్లడించారు. చంద్రుడి మీద విపరీతమైన వేడితో పాటు చల్లదనం కూడా ఉంటుందన్నారు.
ఓవైపు విపరీతమైన వేడి, మరోవైపు గడ్డకట్టే చలి!
ఇక భూమి తనచుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు ఉంటుంది. భూమ్మీద జీవుల మనుగడకు రాత్రి, పగలు అనేవి ఎంతో ఉపయోగపడుతాయి. అలాగే డే, నైట్ కారణంగా భూమి విపరీతంగా వేడెక్కదు. విపరీతంగా చల్లబడదు. కానీ, చంద్రుడు తన చుట్టు తాను తిరగడానికి దాదాపు 28 రోజుల సమయం పడుతుంది. చంద్రుడి మీద వాతావరణం లేదు. చంద్రుడి ఉపరితలం వేడిని బంధించే అవకాశం లేదు. అక్కడ పగటిపూట దాదాపు 14 రోజులు, రాత్రిపూట 14 రోజులు ఉంటుంది. చంద్రుడి ఉపరితలం మీద ఉష్ణోగ్రత పగటి పూట సుమారు 127 ° సెంట్రీగ్రేడ్ ఉంటుంది. సూర్యకాంతి లేనప్పుడు చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రత -173°Cకి చేరుకుంటుంది. చంద్రుడి మీద ఉష్ణోగ్రతల మార్పులు వేగంగా మారుతుంటాయని ప్రొఫెసర్ జాన్ మోనియర్ వెల్లడించారు.
భూమితో పోల్చితే చంద్రుడి మీద విభిన్న పరిస్థితి
భూమి మీద మహాసముద్రాలు ఉన్నాయి. ఇవి సూర్యుని నుంచి వేడిని గ్రహించి నిల్వ చేస్తాయి. రాత్రి సమయంలో నెమ్మదిగా విడుదల చేస్తాయి. చంద్రుడి మీద పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉంటాయి. చంద్రుడి మీద నేలను రెగోలిత్ అని పిలుస్తారు. దీనిలోకి సూర్యకాంతి చొచ్చుకుపోయే గుణం చాలా తక్కువగా ఉంటుంది. సూర్యుడు ఉన్నప్పుడు ఎక్కువ వేడి, సూర్యుడు పోగానే అధిక చలి ఉంటుంది. నాసా పరిశోధనల ప్రకారం చంద్రుడి భూమధ్యరేఖకు సమీపంలో ఉష్ణోగ్రతలు సూర్యరశ్మిలో 121 డిగ్రీల సెల్సీయస్, చీకటిలో మైనస్ 133 డిగ్రీల సెల్సీయస్ వరకు ఉంటాయి.
LRO ఉష్ణోగ్రతలు అంచనా వేసిన నాసా
నాసా జూన్ 2009లో లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్(LRO)ను ప్రయోగించింది. జూలై 2022లో LRO చంద్రుడి ఉష్ణోగ్రతను కొలిచింది. చంద్రుడి గుంటల లోపల దాదాపు 63 షేడెడ్ ప్రాంతాలు ఉన్నాయని కనుగొన్నది. ఇక్కడ ఉష్ణోగ్రత 17 సెల్సీయస్ వరకు ఉన్నట్లు గుర్తించింది. ఈ గుంటలు మానవ ఆశ్రయం కోసం తగిన ప్రదేశాలను తయారు చేయగలవని కనుగొన్నది. చంద్రుని దక్షిణ ధృవంలోని క్రేటర్స్ ప్రత్యక్ష ఉష్ణోగ్రతలను తీసుకోలేదు. కానీ, అక్కడ మైనస్ మైనస్ 248 డిగ్రీ సెల్సీఎస్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు నాసా వెల్లడించింది. “మనం చంద్రుని మీద స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే.. అక్కడ ఉష్ణోగ్రత ఎలా మారుతుందో తెలుసుకోవాలి. అప్పుడే మనం అక్కడ నివసించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకునే అవకాశం ఉంటుంది” అని మోనియర్ చెప్పారు.
Read Also: 2025లో యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నారా? ఇలా చేస్తేనే మీరు సక్సెస్!