Mahesh Kumar Goud : హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడంతో మొదలైన ఘర్షణలు.. ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్ల దాడులు చేసుకునే వరకు వెళ్లాయి. ఈ మొత్తం పరిస్థితుల్ని పరిశీలిస్తున్న ఇరు పార్టీల సీనియర్ నేతలు.. పార్టీ యువత తీరును ఖండిస్తున్నాయి. తాజాగా.. బీజేపీ కార్యాలయం పైకి నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు వెళ్లడంపై.. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. ఓ పార్టీ కార్యాలయంపై మరో పార్టీ కార్యకర్తలు దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.
ఏ విషయమైన నిరసన చేపట్టినా, అవి ఎంత తీవ్రమైనవి అయినా ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసనలు ఉండాలని టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తమ పార్టీ కి చెందిన యూత్ కాంగ్రెస్ నేతలు మరో పార్టీ కార్యాలయంపైకి వెళ్లడాన్ని తప్పుబట్టిన మహేష్ కుమార్.. యూత్ నాయకుల్ని పిలిపించి మందలించనున్నారు. ఇప్పటికే.. ఫోన్ లో యూత్ కార్యకర్తలు, నాయకులకు క్లాస్ పీకినట్లు సమాచారం.
అధికారంలో ఉన్నప్పుడు శాంతిభద్రతల అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్న మహేష్ కుమార్ గౌడ్.. రాజకీయాల్లో ఇలాంటి దాడులు సరైనవి కాదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇటీవల దిల్లీలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి రమేష్ బిదూరి.. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యాలను ఖండించారు. రాజకీయాల్లో అలాంటి విమర్శలకు స్థానం ఉండకూడదని, తమ నాయకురాలి మీద బీజేపీ నేత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆఫీస్ ముట్టడితో అప్రమత్తమైన బీజేపీ కార్యకర్తలు.. కాంగ్రెస్ కార్యకర్తలపై పరస్పర దాడులకు దిగారు. ఈ దాడుల్లో ఇరు పక్షాల్లోని కొందరు గాయపడగా, వారిని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దాంతో.. బీజేపీ నేతలు, కార్యకర్తల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీపీసీసీ.. జాస్వామ్యం లో దాడులు పద్ధతి కాదు..శాంతి భద్రతల విషయంలో బీజేపీ నాయకులు సహకరించాలని కోరారు.
దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు తలమునకలైై ఉన్నాయి. ఎలాగైనా ఆ స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుండగా, ముచ్చటగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాల్లో కొందరు అభ్యర్థులు పరిధులు దాటి మాట్లాడుతున్నారు. బహిరంగ సభల్లో ప్రత్యర్థి పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేందుకు సైతం వెనుకాడడం లేదు. ఈ తరహాలోనే.. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరీ అనే నాయకుడు.. తమను గెలిపిస్తే దిల్లీలోని రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గలు లాగా తయారు చేస్తామంటూ అభ్యంతరకర కామెంట్లు చేశారు. దీనిపై.. అన్ని పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : ఇవి చాక్లెట్లు కాదు.. గంజాయి. నగరంలో విచ్చలవిడిగా గంజాయి చాక్లెట్లు.. జాగ్రత్త అంటున్న పోలీసులు
ఇదే నాయకుడు.. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నాయకురాలు, ప్రస్తుత దిల్లీ ముఖ్యమంత్రి అతిశీ మీద వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. దీనిపై రాజకీయ రచ్చ నడుస్తుండగానే.. ఇప్పుడు మరోమారు వివాదాస్పద కామెంట్లతో ప్రచారం చేసుకుంటున్నాడు.. ఈ నాయకుడు.