Keyboard Mouse AI| ఇప్పటి వరకు కంప్యూటర్ అంటే ఒక మానిటర్, ఒక కీబోర్ట్, ఒక మౌస్ ప్రధాన భాగాలుగా అందరికీ తెలుసు. కానీ ఇకపై అలా ఉండదు. కేవలం మానిటర్ తోనే అన్ని పనులు పూర్తి అయిపోతాయి. కంప్యూటర్ తయారీ ఈ కొత్త విప్తవాన్ని మైక్రోసాప్ట్ తీసుకురాబోతోంది. కంప్యూటర్ల భవిష్యత్తును మార్చే దిశగా మైక్రోసాఫ్ట్ అడుగులు వేస్తోంది. ఇటీవల.. ఇది కృత్రిమ మేధస్సు (AI) కేంద్రంగా ఉన్న ఒక కొత్త రకం విండోస్‌ను ప్రదర్శించింది. కొత్త ఆలోచనలతో ఈ కంప్యూటర్లు ఎలా పనిచేస్తాయో, మనం వాటిని ఉపయోగించే విధానమే మారిపోనుందని ఈ విండోస్ తో తెలుస్తోంది.
విండోస్ 2030 విజన్ వీడియో
మైక్రోసాఫ్ట్ “విండోస్ 2030 విజన్” అనే వీడియోను రూపొందించింది. ఈ వీడియోలో రాబోయే ఐదు సంవత్సరాలలో కంప్యూటర్లు ఎలా మారతాయో చూపించారు. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా విండోస్‌లో పెద్ద మార్పులు రాబోతున్నాయని ఈ వీడియో తెలియజేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎంటర్‌ప్రైజ్, సెక్యూరిటీ విభాగం ఉపాధ్యక్షుడు డేవిడ్ వెస్టన్ ఈ వీడియోలో ఫ్యూచర్ కంప్యూటర్స్ గురించి వివరించారు. AI ద్వారా కంప్యూటర్లను మరింత సహజంగా, సులభంగా ఉపయోగించే విధంగా మార్చవచ్చని ఆయన చెప్పారు.
మౌస్, కీబోర్డ్‌లకు వీడ్కోలు
వెస్టన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే విండోస్ వెర్షన్లలో మౌస్, కీబోర్డ్ అవసరం ఉండదు. దీనికి బదులు మీరు కంప్యూటర్‌తో మాట్లాడితే చాలు, అది మీరు చెప్పినది, చూసినది, విన్నది అర్థం చేసుకుంటుంది. ఉదాహరణకు, “ఈమెయిల్ ఓపెన్ చెయ్యి” అని చెబితే, వెంటనే మీ ఈమెయిల్ తెరుచుకుంటుంది. ఒక ఫైల్‌ను మరొక చోటికి తరలించాలంటే, మీరు చేయితో సైగ చేస్తే చాలు, అది జరిగిపోతుంది. ఈ కొత్త విధానాన్ని “ఏజెంటిక్ AI” అని పిలుస్తారు. ఇది వాయిస్, టచ్, సైగల ద్వారా కంప్యూటర్‌ను నియంత్రించే కొత్త అనుభవాన్ని అందిస్తుంది.
మల్టీమోడల్ ఎక్స్ పీరియన్స్
విండోస్ 2030 మీకు బహుముఖ (మల్టీమోడల్ ఎక్స్ పీరియన్స్) అనుభవాన్ని ఇస్తుంది. మీరు మాట్లాడవచ్చు, స్పర్శించవచ్చు, లేదా కంప్యూటర్‌కు సైగల ద్వారా చూపించవచ్చు. AI ఈ వివిధ రకాల ఇన్‌పుట్‌లను ఒకేసారి అర్థం చేసుకుంటుంది. ఇది మీకు వేగం, సౌలభ్యం, మానవీయ అనుభవాన్ని అందిస్తుంది. ఈ కొత్త వ్యవస్థ మీ టాస్క్‌లు, ఈమెయిల్స్, ఫైల్స్, వర్క్‌ఫ్లోలను సులభంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.
కంప్యూటర్లు మీ అవసరాలకు అనుగుణంగా మరింత వ్యక్తిగతంగా, సన్నిహితంగా మారతాయి. కష్టమైన ఆదేశాలను నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా, మీరు సాధారణంగా మాట్లాడితే చాలు. AI ద్వారా కంప్యూటర్లు మరింత తెలివిగా, వేగంగా, సహాయకరంగా మారతాయి. ఇదంతా వింటుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా తలపించవచ్చు.. కానీ ఇది నిజం. మైక్రోసాఫ్ట్ రాబోయే కొన్ని సంవత్సరాలలో దీనిని వాస్తవ ప్రపంచంలో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.
Also Read: ఆపిల్ కంపెనీ బంపర్ ఆఫర్.. ఆ పని చేసినవారికి రూ 17.5 కోట్లు బహుమతి!