Free Bus Ticket: తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, హైదరాబాద్ సిటీ, మెట్రో బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఓ మహిళ డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వలేదని రచ్చ రచ్చ చేసింది. బస్సు కింద పడుకుని మహిళ బస్సు సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. మణుగూరు నుండి ఖమ్మం వెళ్తున్న డీలక్స్ బస్సులో కొత్తగూడెం వద్ద ఎక్కిన మహిళ ఫ్రీ టికెట్ ఇవ్వాలని వాగ్వాదానికి దిగింది.
డీలక్స్ బస్సులో ఉచిత ప్రయాణం లేదని కండెక్టర్ మహిళకు సర్దిచెప్పినా వినలేదు. బస్సుకు అడ్డంగా కూర్చుని ఫ్రీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. మహిళకు నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చిన వారించిన ఆ మహిళ వినలేదు. బస్సును అక్కడి నుంచి కదలనివ్వకుండా.. కిందకి వెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆమెను మందలించి కుటుంబ సభ్యులతో పంపించారు. మహిళ మద్యం సేవించి ఉందని పోలీసులు తెలిపారు.
మహిళా ప్రయాణికురాలు బస్సుకు అడ్డంగా కూర్చోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ జామ్ అయింది. పలువురు వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మహిళ తీరు పట్ల పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Telangana: దసరా వేళ దారుణం.. ఆ ఊరిలో బతుకమ్మ ఆడనివ్వని ఊరి పెద్దలు, ఏం జరిగింది?
హైదరాబాద్ లో ఉచిత బస్సు ప్రయాణాలపై టీజీఎస్‌ఆర్టీసీ కొత్త ప్రయత్నం చేయనుంది. త్వరలో మహిళలకు స్మార్ట్ కార్డులను ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. ముందుగా విద్యార్థుల బస్ పాస్‌లను స్మార్ట్ కార్డులుగా మార్చనున్నారు. ఇది విజయవంతమైతే సాధారణ పాస్‌లతో పాటు మహాలక్ష్మి ఉచిత ప్రయాణికులకు స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు.
ముంబయి, బెంగళూరు, లఖ్‌నవూ వంటి నగరాల్లో స్మార్ట్ కార్డులు అమల్లో ఉన్నాయి. వీటి పనితీరుపై తెలంగాణ అధికారులు ఆ నగరాలను సందర్శించి అధ్యయనం చేస్తున్నారు. ఈ విధానం వల్ల వచ్చే లాభాలు, సవాళ్లను పరిశీలిస్తున్నారు.