Youtube Premium Lite| గూగుల్ కంపెనీ భారతదేశంలో తమ యూట్యూబ్ వినియోగదారుల కోసం కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ పేరు “యూట్యూబ్ ప్రీమియం లైట్”. ఇది సాధారణ యూట్యూబ్ ప్రీమియం కంటే చౌక ప్లాన్. ఈ ప్లాన్ లో ప్రకటనలు లేకుండా వీడియోలు చూసే సౌకర్యం ఉంది. అయితే ఇందులో ప్రీమియం ప్లాన్ లోని అన్ని ఫీచర్లు లేనప్పటికీ.. ప్రకటనలు లేకుండా వీడియోలు చూడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఆప్షన్. ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ గురించి పూర్తి వివరాలు ఇవే..
భారతదేశంలో యూట్యూబ్ ప్రీమియం లైట్ ధర
యూట్యూబ్ అధికారిక బ్లాగ్ ప్రకారం.. ప్రీమియం లైట్ ప్లాన్ ధర నెలకు కేవలం రూ.89. ఇది యూట్యూబ్ ప్రీమియం స్టూడెంట్ ప్లాన్ ధరతో సమానం. యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోలు చూడటానికి ఈ ప్లాన్ సరిపోతుంది. సాధారణ ప్రీమియం ప్లాన్ ధర నెలకు రూ.149 లేదా సంవత్సరానికి రూ.1,490.
అలాగే, ప్రీమియం కింద ఫ్యామిలీ ప్లాన్ (నెలకు 299 రూపాయలు) డ్యూయో ప్లాన్ (నెలకు 219 రూపాయలు) కూడా ఉన్నాయి. ప్రీమియం లైట్ ధర ఇతర ప్లాన్‌లతో పోలిస్తే చాలా తక్కువ, ఇది బడ్జెట్‌లో ఉన్నవారికి అనువైన ఆప్షన్.
యూట్యూబ్ ప్రీమియం లైట్ ప్లాన్ లో ప్రయోజనాలు
ఈ కొత్త ప్లాన్‌లో “చాలా” వీడియోలపై యాడ్స్ లేకుండా చూసే సౌలభ్యం ఉంటుంది. గేమింగ్, బ్యూటీ, ఫ్యాషన్, న్యూస్ వంటి విభాగాల్లోని వీడియోలు ఈ సౌకర్యం కింద వస్తాయి. అయితే యూట్యూబ్ ఈ ప్లాన్ లో చాలా కేటగిరీల వీడియోలు అని చెప్పినప్పటికీ, దీనిపై స్పష్టత ఇవ్వలేదు. కొన్ని వీడియోలలో యాడ్స్ ఇప్పటికీ కనిపించవచ్చు.
ఈ ప్లాన్‌లో యూట్యూబ్ మ్యూజిక్ సేవలు లేవు, అలాగే బ్యాక్‌గ్రౌండ్ ప్లే లేదా ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా లభించవు.
అయినప్పటికీ, ఎక్కువ సమయం వీడియోలు చూసే వారికి, ప్రకటనల వల్ల అంతరాయం లేకుండా చూడాలనుకునే వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగకరం. ఈ సబ్‌స్క్రిప్షన్ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు వంటి అన్ని డివైస్‌లలో పనిచేస్తుంది. అయితే, మ్యూజిక్ వీడియోలు, షార్ట్స్, లేదా బ్రౌజింగ్ సమయంలో యాడ్స్ కనిపించవచ్చని యూట్యూబ్ స్పష్టం చేసింది.
అమెరికాతో పోలిస్తే భారతదేశంలో ధర
ఈ యూట్యూబ్ ప్రీమియం లైట్ ప్లాన్‌ను మొదట అమెరికాలో ఈ ఏడాది ప్రారంభించారు. అక్కడ దీని ధర నెలకు 7.99 డాలర్లు (సుమారు 709 రూపాయలు). భారతదేశంలో 89 రూపాయల ధరతో పోలిస్తే.. ఈ ప్లాన్ భారతీయులకు అత్యంత చౌక ప్లాన్. ఈ తక్కువ ధర వల్ల భారతీయ వినియోగదారులకు ప్రీమియం లైట్ చాలా ఆకర్షణీయంగా ఉంది.
మొత్తంగా.. యూట్యూబ్ ప్రీమియం లైట్ అనేది బడ్జెట్‌లో ఉన్నవారికి, యాడ్స్ లేకుండా వీడియోలు చూడాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఆప్షన్. ఇది పూర్తి ప్రీమియం ఫీచర్లను అందించకపోయినా, సరసమైన ధరలో అంతరాయం లేని అనుభవాన్ని ఇస్తుంది.
Also Read: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!