అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తీసుకునే ఆహారం ఏంటి..?
భూమిపైనుంచి తీసుకెళ్లే ఫ్రీజ్-డ్రైడ్ మీల్స్, ప్రోటీన్ బార్. ఇవే వారికి ఆహారం, వీటితోనే వారి జీవనం.
ఇకపై వీటి అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. అంతరిక్షంలో కూడా ఎంచక్కా వ్యవసాయం చేసుకుని బతకవచ్చని చెబుతున్నారు. ఆ దిశగా జరుగుతున్న ప్రయోగాల్లో ‘మూన్ రైస్’ అనే అద్భుత ఆవిష్కరణను వారు కనిపెట్టారు. దీని ద్వారా అంతరిక్షంలో కూడా మనం ధాన్యాన్ని పండించుకోవచ్చు. పోషకాలతో కూడిన అన్నం తినొచ్చు.
అంతరిక్షంలోనే ఆహారం..
అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు కొన్ని నెలలకు సరిపడా ఆహారాన్ని ఇక్కడినుంచే పంపిస్తుంటారు. ఆ ఆహారంతోనే వారు అక్కడ జీవనం గడుపుతారు. శారీరకంగా వారికి కావాల్సిన పోషకాలు అన్నీ వాటిలో ఉన్నా.. మానసికంగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అంతరిక్షంలోనే కావాల్సినవి పండించుకుని, వండుకుని తింటే ఎలా ఉంటుంది..? ఆ ఆలోచన నుంచి వచ్చిందే ‘మూన్ రైస్’. చంద్రుడు, అంగారకుడిపై శాశ్వత స్థావరాల కోసం సిద్ధమవుతున్న మానవుడు.. అక్కడే ఆహారాన్ని తయారు చేసుకోవడంపై కూడా దృష్టిపెట్టాలని శాస్త్రవేత్తలు భావించారు. అందుకే వారు ఈ ఆవిష్కరణలకు సిద్ధమయ్యారు. అంతరిక్ష వాతావరణాన్ని తట్టుకుని, ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను ఎదుర్కోవడానికి వ్యోమగాములకు విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండే తాజా ఆహారం అవసరం. ఈ ఆహారంపై ఇటాలియన్ విశ్వ విద్యాలయాలు నాలుగేళ్లుగా విపరీతమైన ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే వారు చాలా అడ్డంకుల్ని ఎదుర్కొన్నారు. అంతరిక్షంలో పంటలు పండించొచ్చు కానీ, వాటి పరిణామమే ఇక్కడ అసలుసమస్య. అంతరిక్షంలో ప్రతి సెంటీమీటర్ కూడా కీలకం. అలాంటప్పుడు మన పంటల్ని అక్కడ పండించడం సాధ్యం కాదు.
10 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే వరి పైరు..
మిలన్ విశ్వవిద్యాలయం కేవలం 10 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగే వరి వంగడాలను సృష్టించింది. అంటే ఇక్కడ వరిపైరు కేవలం ఒక స్మార్ట్ ఫోన్ అంత పొడవు పెరుగుతుంది. రోమ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండేలా జన్యువులను మారుస్తున్నారు. నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచడంపై జరుగుతున్న దశాబ్దాల పరిశోధనలకు ఇప్పుడు ఫలితం దక్కింది. ప్రస్తుతం ఈ ప్రయోగాలన్నీ భూమిపైనే జరుగుతున్నాయి. త్వరలో అంతరిక్షంలో కూడా ఈ వరి వంగడాలను మొలకెత్తేలా చేస్తారు. తద్వారా అక్కడే ఆహారాన్ని తయారు చేసుకుంటారు. భూమిపైనుంచి పంపించే ఆహారం నెలల తరబడి ఉండాలి, పైగా అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే అంతరిక్షంలోనే ఆహారం తయారీ అనే కాన్పెస్ట్ మొదలైంది. భవిష్యత్తులో ఇతర గ్రహాలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో ప్రయోగాలు జరుగుతాయి. ఆ ప్రయోగాలలో ఆవాసాలతోపాటు ఆహారం కూడా కీలకం అవుతుంది.
పరిమితమైన వనరులు, స్థలంలో మాంసం ఉత్పత్తి అసాధ్యం కాబట్టి.. ఈ ప్రయోగాలన్నీ వరి పైనే జరిగాయి. ప్రోటీన్ అధికంగా ఉండే వంగడాలను వారు సిద్ధం చేస్తున్నారు. చిన్న సైజులో ఉన్నా ఇది వ్యోమగాముల ఆకలి తీరుస్తుంది. వారికి సరిపడా పోషకాలను అందిస్తుంది. గురుత్వాకర్షణ శక్తి లేని ప్రాంతంలో కూడా, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని ఈ మొక్కలు పెరుగుతాయి మంచి దిగుబడిని ఇస్తాయి. దీన్ని ‘మూన్ రైస్’గా పిలుస్తున్నారు.