OpenAI Smartphone: ప్రస్తుత టెక్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు చాట్‌జీపీటీతో సంచలనం సృష్టించిన ఓపెన్‌ఏఐ సంస్థ.. త్వరలోనే తమ సొంత స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. 2027 ప్రథమార్థంలో ఈ ఫోన్ తయారీ మొదలయ్యే అవకాశం ఉంది. ఐఫోన్లను అసెంబుల్ చేసే ఎఫ్ఐహెచ్ మొబైల్ సంస్థే దీన్ని కూడా తయారు చేయనుండటం విశేషం.
ప్రస్తుతం మనం వాడుతున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఏ పని చేయాలన్నా రకరకాల యాప్స్ ఓపెన్ చేయాల్సి వస్తోంది. కానీ ఓపెన్‌ఏఐ తీసుకురాబోయే ఫోన్ పూర్తిగా ఏఐ ఏజెంట్ ఆధారంగా పనిచేస్తుంది. మెసేజ్ పంపాలన్నా, మీటింగ్ షెడ్యూల్ చేయాలన్నా, సమాచారం వెతకాలన్నా మనం యాప్స్ మారుస్తూ కష్టపడాల్సిన పనిలేదు. కేవలం మనం చెబితే చాలు, ఫోన్‌లోని ఏఐ అసిస్టెంట్ అన్నీ తనే చక్కబెట్టేస్తుంది.
ఇప్పటివరకు చాట్‌జీపీటీ కేవలం యాపిల్, గూగుల్ ప్లాట్‌ఫామ్స్ పరిధిలోనే పనిచేస్తోంది. దీనివల్ల ఫోన్ ఫీచర్లను పూర్తిస్థాయిలో వాడుకునే అవకాశం ఉండేది కాదు. కానీ సొంత స్మార్ట్‌ఫోన్ రావడం వల్ల నోటిఫికేషన్లు, సెట్టింగ్స్, ఇతర సిస్టమ్ ఫీచర్లపై ఓపెన్‌ఏఐకి పూర్తి పట్టు దొరుకుతుంది. దీనివల్ల యూజర్లకు మరింత వేగవంతమైన, స్మార్ట్ అనుభూతి లభిస్తుంది.
Also Read: జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. రూ.450 రీఛార్జ్‌తో ఫ్రీ జియో హాట్‌స్టార్, ఏడాది పాటు కాన్వా ప్రో లైట్!
ప్రముఖ టెక్ విశ్లేషకుడు మింగ్-చి కువో సమాచారం ప్రకారం.. ఈ ఫోన్‌లో కస్టమైజ్డ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600 చిప్‌సెట్‌ను వాడబోతున్నారు. ఇందులో ఉండే డ్యూయల్ ఎన్పీయూ వల్ల చిన్నచిన్న ఏఐ పనులన్నీ ఇంటర్నెట్ లేకుండానే ఫోన్‌లోనే వేగంగా జరిగిపోతాయి. ఇక కెమెరా విషయానికొస్తే.. మెరుగైన హెచ్‌డీఆర్ సపోర్ట్‌తో చుట్టుపక్కల పరిసరాలను ఇట్టే గుర్తించే అప్‌గ్రేడెడ్ ఇమేజ్ ప్రాసెసర్ ఇందులో ఉండబోతోంది.
గత ఏడాది మాజీ యాపిల్ డిజైనర్ జానీ ఐవ్‌కు చెందిన ఐఓ (io) సంస్థను ఓపెన్‌ఏఐ సుమారు రూ.54,600 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సంస్థ తయారు చేస్తున్న డివైజ్, ఈ స్మార్ట్‌ఫోన్ రెండూ వేర్వేరు అని తెలుస్తోంది. స్క్రీన్ లేకుండా కేవలం జేబులో పట్టేంత చిన్నగా ఉండే ఆ ప్రత్యేక ఏఐ గ్యాడ్జెట్ కూడా 2027 ఫిబ్రవరి తర్వాత మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్ రూపురేఖలు పూర్తిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.