కొన్నాళ్ల క్రితం వరకూ సెలబ్రిటీలను సైతం హడాలెత్తించిన డీప్ ఫేక్ వ్యవహారం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత్ దాస్ పేరిట కొన్ని డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పెట్టుబడికి సంబంధించి కొన్ని సలహాలు ఇస్తున్నట్టు వీడియోలు వైరల్ కావడంపై ఆర్బీఐ అప్రమత్తమైంది. ఇలాంటి వీడియోల పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆర్బీఐకి సంబంధించిన కొన్ని పెట్టుబడి పథకాలు త్వరలోనే తీసుకొస్తున్నామని.. ఈ పథకాల్లో మదుపు చేయాలని శక్తి కాంతదాస్ చెప్తున్నట్లు కొన్ని వీడియోలు సర్క్యూలేట్ అవుతున్నాయి. ఈ విషయం ప్రజలను కచ్చితంగా పక్కదోవ పట్టించే విధంగా ఉండటంతో.. ఆర్బీఐ వెంటనే అప్రమత్తమయ్యింది. సదరు వీడియోలతో ఆర్బీఐకి ఎలాంటి సంబంధం లేదని.. శక్తికాంత్ దాస్ ఆ వీడియోలో లేరని.. ఇవి డీప్ ఫేక్ వీడియోలని అంటూ స్పష్టం చేసింది. ఆర్బీఐ ఎప్పుడూ పెట్టుబడులకు సంబంధించిన ఎలాంటి సలహాలు ఇవ్వదని.. ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.
ఇక గతంలో సైతం ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు హల్చల్ చేశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇదే తరహా క్లారిటీని ఇచ్చింది. ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ కొన్ని స్టాక్స్ కు సంబంధించిన సలహాలు ఇస్తున్నట్టు వీడియోలు హల్చల్ చేశాయి. ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మొద్దని అప్పట్లో ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది.
గతంలో ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు సెలబ్రిటీలకు ముచ్చెమటలు పట్టించాయి. కొందరు సరదాగా చేశారు. మరి కొందరు ఎదుటి వారిని మోసం చేయాలనే ఉద్దేశంతో చేయటంతో ఇవి చాలావరకు తప్పుదోవ పట్టించేవిగానే ఉన్నాయి. బాలీవుడ్ తారలతో పాటు రాజకీయ నాయకులు, క్రీడాకారులును సైతం ఈ డీప్ ఫేక్ వదలలేదు. అప్పట్లో టాలీవుడ్ హీరోయిన్ రష్మికా మందన డీప్ ఫేక్ వీడియో హల్చల్ చేసింది. ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ డిఫ్ ఫేక్ వీడియోలు సైతం హల్చల్ చేశాయి. వీటిపై అప్పట్లో వారందరూ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.
ఇక ఏ ఉద్దేశంతో చేసినప్పటికీ డీప్ ఫేక్ అనేది పెద్ద నేరమని.. అప్పట్లోనే న్యాయస్థానం తీర్మానించింది. ఇందుకు కఠిన చర్యలు సైతం ఉంటాయని తెలిపింది. మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రెండు లక్షల జరిమానా సైతం విధిస్తామని.. ఇక పసిపిల్లల శరీరాలపై ఎవరైనా అసభ్యంగా చూపించి అనవసరమైన వీడియోలు చేస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష సైతం విధిస్తామని హెచ్చరించింది. వ్యక్తుల ఏకాంతానికి భంగం కలిగించే విధంగా ఉన్నా కఠిన చర్యలు తప్పమని తెలిపింది. ఇక సెలబ్రిటీల జీవితాల్లో చొరబడి సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తే వారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది.
ALSO READ : త్వరలోనే అమ్మకానికి గూగుల్ క్రోమ్…?