FATHI: రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (FATHI) రేపు హైదరాబాద్‌లో తలపెట్టిన అధ్యాపక సభకు హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నందున.. తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేమని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. దీంతో న్యాయస్థానం సభకు అనుమతి నిరాకరించింది. తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య అత్యవసరంగా సభ నిర్వహించడానికి అనుమతి కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సభ నిర్వహణకు ఎల్బీ స్టేడియం లేదా మరేదైనా ప్రదేశంలో అనుమతి ఇవ్వాలని FATHI తరపు న్యాయవాది కోరారు.
ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..
ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీసింది. కాలేజీల బంద్ అనేది బర్నింగ్ ఇష్యూ అవుతున్నప్పుడు.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? సభకు అనుమతి ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏమిటి? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ప్రతిస్పందించిన ప్రభుత్వ న్యాయవాది.. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నగరంలో ఇంత భారీ సభకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు వారం రోజుల తర్వాత సభ అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది
విద్య వ్యాపారం కాదు.. సేవ: సీఎం రేవంత్
ఇదిలా ఉండగా.. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘విద్య వ్యాపారం కాదు.. అది సేవ’ అని ఆయన స్పష్టం చేశారు. విద్యను వ్యాపారం చేస్తామంటే ఉపేక్షించేది లేదని.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే కళాశాలలైనా.. రాజకీయ పార్టీలైనా సహించేది లేదని హెచ్చరించారు. కొన్ని సంస్థలు నిధులు అడిగి, ఇవ్వలేదని కాలేజీలు మూసేస్తామనడం బ్లాక్‌మెయిల్ కిందకే వస్తుందని, ప్రభుత్వం దీనిని ఊరుకోదని సీఎం తేల్చి చెప్పారు. విడతలవారీగా నిధులు విడుదల చేస్తామని హామీ ఇస్తూనే.. దీనికి విద్యార్థులను ఇబ్బంది పెడితే సహించేది లేదని అన్నారు.
రాజకీయ పార్టీలతో కలిసి…
కొంతమంది తమకు కొత్తగా సమస్యలు వచ్చాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ పరోక్షంగా విమర్శించిన సీఎ.. ‘మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారో తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్లం కాదు’ అని ఘాటుగా స్పందించారు. ఈ విధంగా, అధ్యాపక సంఘం సభకు హైకోర్టులో తాత్కాలిక విరామం లభించగా.. సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలపై కఠిన వైఖరిని ప్రదర్శించారు.