Deepfake : టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో డీప్ ఫేక్ ఎంతగా హల్చల్చ్ చేస్తుందో తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ప్రతీ ఒక్కరూ ఈ డీప్ ఫేక్ బారిన పడినవాళ్లే. ఈ నేపథ్యంలో ఫేక్ స్కీమ్‌లతో కస్టమర్లను టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు డీప్‌ఫేక్ వీడియోలతో మోసం చేస్తున్నారని SBI హెచ్చరించింది. ఇక ఈ వీడియోలను ఎలా గుర్తించాలో ఎక్స్ వేదికగా తెలిపింది.
డీప్‌ఫేక్ పై అవగాహన కల్పిస్తూ SBI తన కస్టమర్స్ ను హెచ్చరించింది. బ్యాంక్ తమ కస్టమర్‌లకు సహాయపడే స్కీమ్‌ను ప్రారంభిస్తోందని లేదా ఫలానా స్కీమ్ లో పెట్టుబడి పెట్టమని ప్రజలను కోరుతున్నట్లు ఉంటుందని తెలిపింది.
నిజానికి ఈ మధ్య కాలంలో డిజిటల్ ఫైనాన్షియల్ మోసాలు, ఆన్‌లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. రీసెర్చ్ రిపోర్టుల ప్రకారం, మార్చి 2023 నుంచి మార్చి 2024 మధ్య దేశంలో ఆన్‌లైన్, డీప్‌ఫేక్ స్కామ్‌లు ఐదు రెట్లు పెరిగాయి. ఈ విషయంలో నకిలీ వీడియోలతో కస్టమర్‌లను టార్గెట్ చేస్తున్న డీప్‌ఫేక్ వీడియోల గురించి తెలుసుకోవడం అత్యవసరమని SBI తన వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. పథకాలు, ప్రణాళికల పేరుతో ప్రజలు స్కామర్ల బారిన పడి కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవడంలో.. ఈ డీప్ ఫేక్ ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలిపింది.
“డీప్‌ఫేక్ వీడియోలు అనేది ఒక రకమైన సైబర్ భద్రతా ముప్పు. ఇక్కడ స్కామర్‌లు నకిలీ వీడియోలు, చిత్రాలు, ఆడియోను రూపొందించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తారు. వీడియో నిజమైనదిగా కనిపిస్తుంది. ఇంకా అసలు వ్యక్తి ఎప్పుడూ చెప్పని ముఖ్యమైన విషయాన్ని ఎవరో చెప్పినట్లు చూపిస్తుంది. SBI చెబుతున్నట్లే ఉంటాయి. తమ ఉన్నతాధికారులు ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని చెబుతున్నట్లు ఉంటుంది. కానీ వాస్తవానికి అలాంటిదేమీ ఉండదు..” అని తెలిపింది.
ఈ డీప్‌ఫేక్ వీడియోలు బ్యాంక్ తమ కస్టమర్‌లకు సహాయపడే స్కీమ్‌ను ప్రారంభిస్తోందని ఇందులో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని కోరుతున్నట్లు చెబుతుంది. ఇక ఈ వీడియోలను నమ్మిన కస్టమర్స్ విపరీతంగా నష్టపోతున్నారు. వాళ్లు చెప్పినట్టే ఆ పథకంలో పెట్టుబడి పెడతారు. ఇంకా ఖాతాలో ఉన్న మెుత్తం డబ్బును కోల్పోతారు. వీటితో పాటు అదనంగా స్కామర్‌లు సాంకేతిక సాధనాల ద్వారా కూడా తమ పథకాలలో పెట్టుబడి పెట్టమని కస్టమర్స్ ను కోరుతారని తెలిపింది.
డీప్ ఫేక్ ను ఎలా గుర్తించాలని SBI తెలిపిందంటే –
ఈ తప్పుడు పథకాలు, డీప్‌ఫేక్ వీడియోల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తూ SBI ఎక్స్ లో పోస్ట్ చేసింది. వీడియో డీప్‌ఫేక్ అవునో కాదో స్వయంగా తనిఖీ చేయోచ్చని తెలిపింది. డీప్‌ఫేక్ వీడియోను గుర్తించాలనుకుంటే… వీడియో క్లారిటీని గమనించాలని తెలిపింది. వీడియోలో నీడలు కనిపించటం, అస్పష్టంగా అనిపించటం వంటివి జరుగుతాయని తెలిపింది. ముఖంలో క్లారిటీ ఉండదని… ఫేస్ ను అతికించటంతో అసమానతలు క్లియర్ గా కనిపిస్తాయని తెలిపింది. వాయిస్ తో పాటు లిప్ సింకింగ్ లో తేడా కనిపిస్తుందని తెలిపింది. అందుకే ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే అప్రమత్తమవ్వాలని చెప్పుకొచ్చింది.
ALSO READ : Gmailకు పోటీగా Xmail.. ఎలాన్ మస్క్ వ్యూహం ఇదేనా!