Allu Arjun Sandhya Theater Case : ‘పుష్ప 2’ (Pushpa 2) ప్రీమియర్ షోల టైంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఘటన జరిగినప్పుడు రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కొడుకు శ్రీ తేజ తీవ్ర గాయాల పాలై, ఆస్పత్రిలో చికిత్సలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శ్రీ తేజ్ (Sritej) ను రామర్శించడానికి తెలంగాణ రాష్ట్ర హెల్త్ సెక్రటరీ, కమిషన్ సీవీ ఆనంద్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు హాస్పిటల్ కు వెళ్లబోతున్నారని సమాచారం.
డిసెంబర్ 4న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీ తేజ్ అనే బాలుడు తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. అతన్నీ కాపాడి ఆమె తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అందరిని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. దీంతో అల్లు అర్జున్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఇప్పటిదాకా అల్లు అర్జున్ (Allu Arjun) శ్రీ తేజ కుటుంబాన్ని పరామర్శించలేదు.
అయితే ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్న తనను శ్రీ తేజ్ ఫ్యామిలీని కలవకూడదని ఆంక్షలు ఉన్నాయని రీసెంట్ గా అల్లు అర్జున్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీ తేజ చికిత్స తీసుకుంటున్న కిమ్స్ హాస్పిటల్ కి పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, తెలంగాణ రాష్ట్ర హెల్త్ సెక్రటరీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరి కమిషనర్ సివి ఆనంద్ శ్రీ తేజను పరామర్శించిన తర్వాత ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక మరోవైపు అల్లు అర్జున్ (Allu Arjun) పై మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలి అంటూ పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించబోతున్నారని టాక్ నడుస్తోంది. గత శుక్రవారం సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun) ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. కానీ హైకోర్టులో అప్పటికే వేసిన క్యాష్ పిటిషన్ విచారణ జరిగాక, అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ దొరికింది. అయినప్పటికీ ఆయన ఒకరోజు రాత్రి జైల్లో గడపక తప్పలేదు. అనంతరం బయటకు వచ్చిన అల్లు అర్జున్ మరోసారి ఘటన జరిగినందుకు క్షమాపణలు చెబుతూ, ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయినప్పటికీ పోలీసులు ఈ కేసును వదిలేలా కనిపించట్లేదు.
సంధ్య థియేటర్ యాజమాన్యం హీరో అక్కడికి వస్తున్నాడు అన్న సమాచారాన్ని ముందుగానే పోలీసులకు ఇచ్చామని చెప్పడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణలో పట్టు బిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పలువురు సెలబ్రిటీలు అల్లు అర్జున్ (Allu Arjun) ను వరుసగా పరమర్శిస్తున్నారు.