తండ్రి లేకుండా బిడ్డ: అంటే నేరుగా తండ్రి ప్రమేయం లేకుండా ఇతరత్రా వైద్య విధానాల వల్ల కేవలం తల్లి ద్వారానే పిల్లల్ని పుట్టించవచ్చు.
మరి తల్లి లేకుండా బిడ్డ: ఇప్పటి వరకు ఇది అసాధ్యం అనే అనుకున్నారు. కానీ చైనా శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని సాధించారు. తల్లిలేని బిడ్డను బయటకు తీశారు.
ఎప్పుడు, ఎక్కడ..?
చైనాలోని షాంఘై జియావో టోంగ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం రెండు మగ ఎలుకలతో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. జూన్ 23న ఈ పరిశోధనల ఫలితాన్ని, తాము సాధించిన విజయాన్ని వారు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించారు.
పరిశోధన ఎలా జరిగింది..?
ఈ ప్రయోగాన్ని నిర్వహించడానికి, చైనా పరిశోధకులు రెండు వేర్వేరు జాతుల ఎలుకల వీర్యాన్ని ఉపయోగించారు. ఒక జాతి ఎలుకను యూరోపియన్ ప్రయోగశాలలలో పెంచారు. రెండోదాన్ని థాయిలాండ్‌లోని అడవి నుంచి తీసుకొచ్చారు. గతంలో కూడా ఇలాంటి ప్రయోగాలు జరిగాయి కానీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. గతంలో జరిగిన ప్రయత్నాల వల్ల ఎలుక పిల్లలు పుట్టినా అవి బలహీనంగా ఉన్నాయి. రోజుల వ్యవధిలోనే చనిపోయాయి. 2004లో, శాస్త్రవేత్తలు ఇద్దరు ఆడ ఎలుకలతో ఒక ఎలుకను సృష్టించారు, దానికి కగుయా అని పేరు పెట్టారు. తర్వాత రెండు మగ ఎలుకలతో ప్రయోగాలు మొదలు పెట్టారు. కానీ దీని ఫలితంగా వచ్చిన ఎలుకలు అనారోగ్యంగా ఉన్నాయి, రోజుల వ్యవధిలోనే చనిపోయాయి. దీంతో మరిన్ని పరిశోధనలు చేపట్టాల్సి వచ్చింది. ఈసారి మరింత పట్టుదలతో చైనా పరిశోధకులు ప్రయోగాలు నిర్వహించారు.
ఈసారి మాత్రం ఎలుక పిల్లలు ఆరోగ్యంగా పుట్టాయి. రెండు స్పెర్మ్ నమూనాల నుండి DNA ను తీసుకుని 250 పిండాలను సృష్టించారు. అందులోనుంచి మూడు పిల్లలు ఆరోగ్యంగా పుట్టాయి. వాటిలో రెండు పూర్తిస్థాయి ఆరోగ్యంతో ఉన్నాయి. మూడో ఎలుక పిల్ల రెండు రోజుల తర్వాత చనిపోయింది. ఇక్కడ ఆడ డీఎన్ఏ ఊసే లేదు, అసలు అండం అనే పదానికి చోటే లేదు. కేవలం రెండు మగ ఎలుకల వీర్యంతో డీఎన్ఏను సృష్టించి ఎలుకలను పునరుత్పత్తి చేశారు. అంటే పూర్తిగా ఆడ ఎలుకల ప్రమేయం లేకుండా ఇక్కడ పిల్ల ఎలుకలకు శాస్త్రవేత్తలు జన్మనిచ్చారు.
ఈ ప్రక్రియను ఎపిజెనెటిక్ ప్రోగ్రామింగ్ అంటారు. DNA మిథైలేషన్ టార్గెట్ రీప్రొగ్రామింగ్ ఉపయోగించి పరిశోధకులు ఈ ఘనత సాధించారు. DNA క్రమాన్ని మార్చకుండా జన్యు కార్యకలాపాలను మాత్రమే మార్చారు. ఫలదీకరణం చెందని గుడ్డు నుండి జన్యువును తొలగించి, కణంలోకి రెండు స్పెర్మ్ హెడ్‌లను ఇంజెక్ట్ చేశారు. ఇక్కడ స్పెర్మ్ నమూనాలు రెండూ తల్లి అండంలా పనిచేయడం విశేషం. ఇది పిండానికి XX, XY క్రోమోజోమ్ కలయికలను ఇచ్చింది. ఇక్కడ శాస్త్రవేత్తలు YY క్రోమోజోముల కలయికను నివారించగలికారు. అయితే, ఈ ప్రయోగాన్ని మానవులకు నేరుగా అన్వయించలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పరిశోధన బిడ్డలు పుట్టనివారికి వరంగా మారుతుందని మాత్రం చెబుతున్నారు. రాబోయే రోజుల్లో సంతాన లేమి సమస్యలకు ఈ పరిశోధన పరిష్కారం చూపిస్తుందని, మనుషుల్లో కూడా ఈ ప్రయోగాలు జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.