
Twitter Video App : ఎలన్ మస్క్.. ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత పూర్తిగా ట్విటర్ రూపురేఖలే మారిపోయాయి. యూజర్లు ఎప్పుడూ ఊహించని కొత్త కొత్త అప్డేట్స్, ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అందులోనూ మస్క్ క్రియేటివ్ ఐడియాలు ఒక్కొక్కసారి యూజర్లను ఆశ్చర్యపరుస్తున్నాయి కూడా. ఇప్పుడు ఎన్నో ఇతర క్రేజీ యాప్స్‌కు పోటీ ఇవ్వాలని ట్విటర్ నిర్ణయించుకుంది. అందుకే దానికి తగినట్టుగా ఎలన్ మస్క్ అండ్ టీమ్ అడుగులు వేస్తోంది.
గూగుల్ అనేది ఎలాగైతే బెస్ట్ ఆన్‌లైన్ సెర్చ్ ఇంజెన్‌గా ఏళ్ల తరబడి యూజర్లను ఆకర్షిస్తుందో.. యూట్యూబ్ కూడా అలాగే వీడియో కంటెంట్ విషయంలో యూజర్లను ఆకర్షిస్తూ వస్తోంది. ఇప్పటివరకు యూట్యూబ్‌కు పోటీగా వచ్చిన వీడియో కంటెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవీ స్ట్రాంగ్‌గా నిలబడలేకపోయాయి. కంటెంట్ క్రియేటర్స్‌కు, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు, మూవీ లవర్స్‌కు, గేమర్స్‌కు.. ఇలా ఎంతోమందికి యూట్యూబ్ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తూ వస్తోంది. 2005లో లాంచ్ అయిన యూట్యూబ్.. ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.
యూట్యూబ్ అనేది స్మార్ట్ టీవీలలో కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇలాంటి ఒక ఫీచర్ కోసమే ట్విటర్ టీమ్ పనిచేయడం మొదలుపెట్టింది. దానికి ట్విటర్ వీడియో యాప్ అని పేరుపెట్టింది. ట్విటర్‌లో పెద్ద వీడియోలను అప్‌లోడ్ చేయడానికి మస్క్.. ఇటీవల యూజర్లకు అనుమతిని అందించాడు. కానీ ఈ వీడియోలు టీవీలో చూస్తే బాగుంటుంది కదా అనే ఐడియా మస్క్‌కు వచ్చింది. దీంతో స్మార్ట్ టీవీలో ట్విటర్ వీడియోలను చూసుకునే అవకాశం అందిస్తున్నట్టుగా మస్క్ హింట్ ఇచ్చాడు.
‘స్మార్ట్ టీవీలలో కచ్చితంగా ట్విటర్ వీడియో యాప్ అనేది ఉండాల్సిందే. ఎందుకంటే గంటల తరబడి ఉన్న వీడియోలను ఫోన్‌లో చూడడానికి నాకైతే ఇష్టం లేదు.’ అని ఒక ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు. దీనికి మస్క్ ‘వస్తుంది’ అంటూ స్పందించాడు. దీంతో ఈ ట్విటర్ వీడియో యాప్ అనేది యూట్యూబ్‌కు పోటీ వస్తుందని యూజర్లు అప్పుడే అంచనా వేస్తున్నారు. గత నెలలో 2 గంటల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని యూజర్లకు అందించింది ట్విటర్. అప్పటినుండి దీనిని మరింత మెరుగ్గా యూజర్లకు అందించాలని ట్విటర్ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ట్విటర్ వీడియో యాప్ ఆలోచనతో ముందుకొచ్చింది.