ఇంటి పరిసరాలు, ఆఫీస్ లో సెక్యూరిటీ కోసం చాలామంది సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. అయితే వీటి పరిధి కాస్త తక్కువేనని చెప్పాలి. 360 డిగ్రీస్ తిరిగే సీసీ కెమెరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నా కూడా ఒకేసారి అది అన్ని యాంగిల్స్ ని కవర్ చేయలేదు. కొన్ని సందర్భాల్లో సీసీ కెమెరాల కన్నుగప్పి కూడా దొంగతనాలు జరుగుతుంటాయి. ఇంకా వీటికి చాలా పరిమితులున్నాయి. ఈ పరిమితులను తొలగిస్తూ ఇప్పుడు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఇటాలియన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వైఫై సిగ్నల్స్ ని ఉపయోగించే ఈ టెక్నాలజీకి వోఫై అనే పేరు పెట్టారు.
ఫోన్ ద్వారా..
సాధారణంగా వైఫై టెక్నాలజీ ఉపయోగించి ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అనేది మనం గుర్తించవచ్చు. అయితే సదరు వ్యక్తి ఆ వైఫైకి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అది కూడా ఆ వైఫై పరిధిలో ఎక్కడో ఒకట చోట ఉండొచ్చు అనేది మాత్రమే చెప్పగలం. దానికి మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీయే వోఫై. దీని ద్వారా ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అనేది కచ్చితంగా చెప్పవచ్చు. ఆ వ్యక్తి సెల్ ఫోన్ వాడకపోయినా కూడా వోఫై టెక్నాలజీ పసిగడుతుంది.
వోఫై ఎలా పనిచేస్తుంది..?
వోఫై టెక్నాలజీ ఉపయోగించే సమయంలో వ్యక్తుల చేతి వేలిముద్రలు ఉపయోగిస్తారు. ఆయా వేలిముద్రలు కలిగిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారనేది వోఫై నిర్దిష్టంగా గుర్తించగలదు. రెండు మూడు వైఫై సిగ్నల్స్ ని దాటే క్రమంలో ఆ వ్యక్తి ఐడెంటిటీని గుర్తిస్తుంది. శరీరం వైఫై సిగ్నల్స్ ని నిరోధిస్తుంది కాబట్టి ఆ శరీర కదలికలు రికార్డ్ అవుతాయి. ఛానల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ గా ఈ కదలికలను సంగ్రహిస్తారు. కెమెరాలు లేకుండానే ఆయా స్థానాల్లో వోఫై టెక్నాలజీ వ్యక్తులను గుర్తించగలదు.
ఫోన్ లేకుండానే
ఫోన్ ఉన్నప్పుడు వైఫై సిగ్నల్ ని క్యాచ్ చేయడం, సిగ్నల్ తీసుకున్న పరికరాన్ని గుర్తించడం, తద్వారా ఆ వ్యక్తియొక్క స్థానాన్ని అంచనా వేయడం సులభం. ఫోన్ లేకుండా కూడా మనిషిని వోఫై ద్వారా గుర్తించడం ఇప్పుడు సంచలనంగా మారింది. డీప్ న్యూరల్ నెట్‌వర్క్ ట్రాన్స్‌ఫార్మర్ ఎన్‌కోడింగ్ ఆర్కిటెక్చర్ అనే పద్ధతిని ఉపయోగించి 95శాతం కచ్చితత్వంతో వోఫై వ్యక్తులను గుర్తిస్తోంది. 2020లో ఐఫై అనే టెక్నాలజీ వచ్చింది. అది కేవలం 75 శాతం కచ్చితత్వాన్ని మాత్రమే సాధించగా, ఇప్పుడు వోఫై 95 శాతం కచ్చితత్వాన్ని సాధించింది.
వైఫై వ్యవస్థ అభివృద్ధి చెందిన తర్వాత వివిధ పనులకోసం దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. జలపాతాలను గుర్తించడం, సిగ్నల్స్ అని అడ్డుకునే వస్తువుల దూరాన్ని అంచనా వేయడం ఇందులో ముఖ్యమైనవి. అంటే ఒకరకంగా రాడార్ సిగ్నల్స్ లా అనమాట. అయితే దీనికి కొనసాగింపుగా వచ్చిన వోఫై ఇప్పుడు సీసీ కెమెరాల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రూపొందుతోంది. దీని ద్వారా ఖర్తు తక్కువ, ఫలితం ఎక్కువ అంటున్నారు పరిశోధకులు. గోడలు అడ్డుగా ఉన్నా అవతల ఉన్న వ్యక్తుల్ని వోఫై పసిగట్టగలదు. అయితే వ్యక్తుల గోప్యతా స్వేచ్ఛను ఇది ఉల్లంఘిస్తుందని అంటున్నారు కొందరు. వ్యక్తుల ఉనికి వారికి తెలియకుండానే పసిగట్టడం సరికాదంటున్నారు.