ఆన్ లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో మోసాలను అరికట్టేందుకు భారతీయ రైల్వే కఠిన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే 2.5 కోట్లకు పైగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది. అధునాతన డేటా విశ్లేషణల ద్వారా అనుమానాస్పద బుకింగ్ కార్యకలాపాలను గుర్తించి తొలగించింది. పార్లమెంటు సభ్యుడు A. D. సింగ్ లేవనెత్తిన ప్రశ్నలకు రైల్వేశాఖ లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాలను వెల్లడించింది.
రైల్వే టికెట్ల బుకింగ్ పై కీలక అంశాలు లేవనెత్తిన ఎంపీ సింగ్
భారతీయ రైల్వేలో టికెట్ల బుకింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అయిపోవడం, టికెటింగ్ మోసాలను అరికట్టేందుకు రైల్వే తీసుకుంటున్న చర్యల గురించి వివరించాలని ఎంపీ A. D. సింగ్ కోరారు. ఈ ప్రశ్నకు తాజాగా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన రైల్వేశాఖ నిజమైన ప్రయాణీకులకే టికెట్ల అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. “టికెట్ బుకింగ్ వ్యవస్థలో జరిగే అక్రమాలను అరికట్టే ఉద్దేశ్యంతో, IRCTC ఇటీవల 2.5 కోట్లకు పైగా యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది. తాజా డేటా విశ్లేషణ ద్వారా అనుమానాస్పదంగా ఉన్న అకౌంట్లను తొలగించింది. రిజర్వ్ చేయబడిన టికెట్లను ఆన్ లైన్ లో, కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, మొత్తం టికెట్లలో దాదాపు 89% ఆన్ లైన్ ద్వారా బుక్ చేయబడుతున్నాయి” అని వివరించింది.
అమల్లోకి కొత్త తత్కాల్ బుకింగ్ రూల్స్
జులై 1 నుంచి కొత్త తత్కాల్ బుకింగ్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. తత్కాల్ టికెట్లను ఆధార్ అథెంటిఫికేషన్ తర్వాతే వినియోగదారులు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్ సైట్ లేదంటే యాప్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. తత్కాల్ రిజర్వేషన్ ప్రారంభమైన తొలి 30 నిమిషాలలో ఏజెంట్లు టికెట్లు బుక్ చేసే అవకాశం లేదు. ప్రయాణీకులు మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అటు వెయిట్ లిస్ట్ చేయబడిన ప్రయాణీకులకు టికెట్ కన్ఫార్మ్ అయ్యేలా VIKALP అని పిలిచే ప్రత్యామ్నాయ రైల్వే స్కీమ్ ను అమలు చేస్తోంది. అటు టికెట్ బుక్ చేసుకున్న తరగతికి పై క్లాస్ లో బెర్తులు ఖాళీగా ఉంటే వాటిని పొందేలా అప్ గ్రేడేషన్ పథకంను అమలు చేస్తుంది. ఎలాంటి అదనపు డబ్బులు చెల్లించకుండానే పై క్లాస్ లో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది.
తత్కాల్ బుకింగ్‌లకు తప్పనిసరి ఆధార్ ప్రామాణీకరణ, పీక్ అవర్స్ సమయంలో ఏజెంట్ యాక్సెస్ పై నిషేధం, PRS కౌంటర్లలో మరింత పారదర్శక డిజిటల్ చెల్లింపు వ్యవస్థలతో సహా కొత్త సంస్కరణలను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. టికెట్ల బుకింగ్ మోసాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: నీటితో నడిచే రైలు.. ప్రయోగం సక్సెస్.. పరుగులు తీసే తొలి మార్గం ఇదే!