Big Stories

Match : భారత్ – కివీస్ వన్డే సిరీస్.. తొలి ఫైట్ కు ఇరుజట్లు సిద్ధం

Match : భారత్ -న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు సమయం ఆసన్నమైంది. ఆక్లాండ్ వేదికగా శుక్రవారం తొలి పోరు జరగుతుంది. శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా వన్డేల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. అదే జోరును వన్డే సిరీస్ ను చూపించాలని తహతహలాడుతోంది. ఇటీవల టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. మరో ఏడాదిలో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. అందుకే ఇప్పటి నుంచి ఇరు జట్లు ప్రపంచ కప్ కు సన్నద్ధమవుతున్నాయి. భారత్ వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ, కోహ్లీ, రాహుల్ , హార్థిక్ పాండ్యా , భువనేశ్వర్ కు విశ్రాంతినిచ్చింది. యువఆటగాళ్లకు అవకాశం కల్పించింది. గత న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ ను టీమిండియా 5-0 తో కైవసం చేసుకుంది. అయితే వన్డే సిరీస్ ను 3-0, టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో కోల్పోయింది భారత్ జట్టు. ఈ సారి మాత్రం వన్డే సిరీస్ ను కూడా గెలవాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

టీమ్ కూర్పు ఇదే
శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్ ఓపెనర్లగా దిగుతారు. ఈ జోడికి మంచి రికార్డు ఉంది. 8 వన్డేల్లో 3 సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశారు. ఈ ఏడాది శుభమన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. 75. 71 యావరేజ్ తో 530 పరుగులు చేశాడు. ఇదే జోరును గిల్ కొనసాగిస్తే వచ్చే వన్డే వరల్డ్ కప్ లో బ్యాకప్ ఓపెనర్ గా స్థానం దక్కడం ఖాయం .వన్ డౌన్ లో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగుతాడు. సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో వస్తాడు. ఆ తర్వాత పంత్ కు అవకాశం దక్కుతుంది. ఆరో స్థానాన్ని ఆల్ రౌండర్ దీపక్ హుడాతో భర్తీ చేసే అవకాశం ఉంది. ఆ స్థానానికి వాషింగ్టన్ సుందర్ కూడా పోటీలో ఉన్నాడు. టీ20 సిరీస్ ఆడని దీపక్ చహర్ , శార్దుల్ ఠాకూర్ కు మంచి అవకాశం ఈ వన్డే సిరీస్. స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్ కు ఒకటి రెండు మ్యాచ్ ల్లో ఛాన్స్ రావచ్చు. టీ20ల్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న అర్షదీప్ వన్డేల్లో సత్తా చాటుతాడని అంచనాలున్నాయి. ఇక సంజు శాంసన్ ను మరోసారి బెంచ్ కే పరిమితం చేస్తారో?అవకాశమిస్తారో? చూడాలి.

- Advertisement -

కివీస్ కు సవాలే
మూడో టీ20కి దూరమైన కెప్టెన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. 2019 వరల్డ్ కప్ నుంచి విలియమ్సన్ కేవలం 6 వన్డేలు మాత్రమే ఆడాడు. కీపర్ టామ్ లాథమ్ మిడిల్ ఆర్డర్ లోకి వచ్చాడు. భారత్ పై మంచి రికార్డు ఉన్న ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీకి స్థానం దక్కింది. కాన్వే, అలెన్ , ఫిలిప్స్ , మిచెల్ తో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే ఉంది. అయితే గత 5 వన్డేల్లో న్యూజిలాండ్ 3 మ్యాచ్ ల్లో ఓడి ..రెండు మ్యాచ్ ల్లో గెలిచింది. ఆ జట్టు ఆడి చివరి మూడు వన్డేల్లోనే ఓటమినే చవిచూసింది. ఇక భారత్ గత 5 వన్డేల్లో 4 విజయాలు నమోదు చేసింది. ఒక్క మ్యాచ్ లో మాత్రమే పరాజయం పాలైంది. సౌథీ మరో వికెట్ తీస్తే 200 వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్లలో జాబితాలో చేరతాడు.

పిచ్ కండిషన్
ఆక్లాండ్ లో ఈడెన్ పార్క్ లో బౌండరీ లైన్ చాలా దగ్గరగా ఉంది. వికెట్ కీపర్ వెనుక వైపు బౌండర్ లైన్ మరీ దగ్గర. ఈ పిచ్ పై సూర్యకుమార్ ఆట చూడాల్సిందే. ఈ మైదానంలో అతడే షాట్లు సునాయాసంగా బౌండరీ లైన్ దాటేస్తాయి. ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లే ఈ పిచ్ పై గతంలో మెరుగ్గా రాణించారు.
వెదర్ రిపోర్ట్
ఆక్లాండ్ లో వాతావరణం మేఘాలతో కూడి ఉంటుంది. గాలులు వీస్తున్నాయి. అయితే వర్షం పడే సూచనలు లేవని వాతావరణశాఖ తెలిపింది.

జట్ల అంచనా
న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ , డరెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, మాట్ హెన్రీ, లూకీ ఫెర్గూసన్.

భారత్ జట్టు: శిఖర్ ధావన్ , శుభ్ మన్ గిల్ , శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార యాదవ్, రిషభ్ పంత్ , దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ , దీపక్ చాహర్, శార్ధుల్ ఠాకూర్ , అర్షదీప్ సింగ్ , చాహల్ / కులదీప్ యాదవ్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News