Big Stories

WPL : ఢిల్లీ బ్యాటర్ల విధ్వంసం.. యూపీ వారియర్స్ చిత్తు..

WPL : మహిళల ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అదరగొడుతోంది. వరసగా రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించింది. తాజాగా యూపీ వారియర్స్ పై 42 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. కెప్టెన్ మెగ్ లానింగ్ ( 42 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 70 రన్స్ ) చెలరేగడంతో భారీ స్కోర్ సాధించింది. చివరి ఓవర్లలో జెమీమా రోడ్రిగ్స్ ( 22 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్ ), జెస్ జొనాసన్ ( 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 42 నాటౌట్ ) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ క్యాపిటల్ స్కోర్ 200 దాటింది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.

- Advertisement -

యూపీ బౌలర్లలో షబ్నిం ఇస్మాయిల్ మాత్రమే కాస్త మెరుగ్గా బౌలింగ్ చేసింది. మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చేశారు. రాజేశ్వరీ గైక్వాడ్, తాహిలా మెక్ గ్రాత్ , దీప్తి శర్మ, సోఫీ ఎకిల్ స్టోన్ లాంటి అంతర్జాతీయ బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు.

- Advertisement -

212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ ప్రారంభంలోనే చేతులెత్తేసింది. 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరోవైపు తాహిలా మెక్ గ్రాత్ ( 50 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో 90 నాటౌట్) మాత్రం ఒంటరి పోరాటం చేసింది. చివరి వరకు క్రీజులో నిలబడింది. చివరి మూడు ఓవర్లలో బౌండరీలతో విరుచుపడింది. అయినా సరే ఆమె పోరాటం ఫలించలేదు. అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఖాయమైపోయింది. దీంతో చివరకు యూపీ వారియర్స్ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 42 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్ గెలిచింది.

ఢిల్లీ బౌలర్లలో జెస్ జొనాసెన్ పరుగులు ఎక్కువ ఇచ్చినా 3 వికెట్లు పడగొట్టింది. సీనియర్ బౌలర్ శిఖా పాండే 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసింది. కాప్ కు ఒక వికెట్ దక్కింది. బ్యాటింగ్ లో అదరగొట్టి, బౌలింగ్ లోనూ సత్తా చాటిన జెస్ జొనాసెన్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News