James Anderson Announced Retirement from International Cricket: అతనో దిగ్గజ ఫాస్ట్ బౌలర్.. ఇన్‌స్వింగ్.. రివర్స్ స్వింగ్ లాంటి ఆయుధాలు ఆయన అమ్ముల పొదలో ఉంటాయి. పిచ్‌తో సంబంధం లేదు. బంతి కొత్తదా.. పాతదా అక్కర్లేదు. వాతావరణ పరిస్థితులతో అవసరం లేదు. అతను ఫామ్‌లో ఉన్నాడంటే ఏ జట్టుకైనా హడల్. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో అతనొక లెజెండ్.. అతనెవరో కాదు.. ఇంగ్లాండ్ ఆటగాడు, 700 టెస్టు వికెట్ల వీరుడు జేమ్స్ అండర్సన్.
42 ఏళ్ల వయస్సులో యువకునిలా బౌలింగ్ చేయడం అతని నైజం. దిగ్గజ బ్యాటర్లను బోల్తా కొట్టించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. మబ్బులు పట్టిన వాతావరణం.. పిచ్‌పై పచ్చిక ఉందో.. ఇక అంతే బ్యాటర్లకు ఆ రోజు పీడ కలే. ఇలాంటివి కేవలం ఏ ఒక్క రోజు చేసినవో కాదు. దాదాపు 21 ఏళ్ళు ఇదే అతని దినచర్య. ఇంగ్లాండ్ జట్టు విజయాల్లో అతనిదో కీలక పాత్ర. ఇలాంటి దిగ్గజ క్రికెటర్ ఇక ఆట నుంచి సెలవు తీసుకోనున్నాడు. సోషల్ మీడియా వేదికగా అతను తన రిటైర్మెంట్ సమయాన్ని ప్రకటించాడు. క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో అతను క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు.
జులై 10 నుంచి జులై 14 వరకు ఇంగ్లాండ్ జట్టు లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఇదే తన చివరి మ్యాచ్ అని ప్రకటించేశాడు అండర్సన్. ఇప్పటి వరకు 187 టెస్టులు ఆడిన అండర్సన్ 700 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 32 5 వికెట్-హాల్‌లు ఉన్నాయి. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్ల ఘనతను మూడు సార్లు సాధించాడు. 2024లో ఇండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 700 వికెట్ల మార్కను అందుకున్నాడు అండర్సన్. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లో అండర్సన్ 3 వ స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్(800), రెండో స్థానంలో ఆస్ట్రేలియా మేటి స్పిన్నర్ షేన్ వార్న్(708) ఉన్నారు.
Also Read: IPL 2024 GT vs KKR Match Preview: గుజరాత్ రేస్ లోకి వస్తుందా?.. నేడు కోల్ కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్
ఇక వన్డే క్రికెట్ విషయానికి వస్తే 194 మ్యాచ్‌లు ఆడిన అండర్సన్ 269 వికెట్లు సాధించాడు. 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన అండర్సన్ 18 వికెట్లు సాధించాడు. మొత్తంగా అండర్సన్ 987 ఇంటర్నేష్నల్ వికెట్లు సాధించాడు. మే 22, 2003 జింబాబ్వేతో జరిగిన లార్డ్స్ టెస్టుతో అండర్సన్ అరంగ్రేటం చేశాడు. అంతకు ముందు డిసెంబర్ 15, 2002లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో వన్డే అరంగ్రేటాన్ని చేశాడు. లార్డ్స్ టెస్టులో ప్రారంభించిన తన టెస్టు క్రికెట్‌ను లార్డ్స్ టెస్టులోనే ముగిస్తున్నాడు మేటి ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్.