Jubilee Hills By Election: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థిని ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా వి.నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. నవంబరు 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ జరగనుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన మాగంటి గోపీనాథ్ (62) ఇటీవల గుండెపోటుతో మృతి చెదారు. దీంతో ఉపఎన్నికల అనివార్యమైంది. గత ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఎంఐఎం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు.
జూబ్లీహిల్స్ సీటు కోసం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వంటి కీలక నేతలు గట్టి ప్రయత్నాలే చేశారు. ఏఐసీసీ మాత్రం స్థానికంగా బలంగా ఉన్న నవీన్ వైపే మొగ్గుచూపింది. నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారిని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థికి గెలుపు కోసం పనిచేయాలని కోరారు. భవిష్యత్తులో వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అసంతృప్త నేతలు తప్పుకోవడంతో నవీన్ యాదవ్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా టికెట్ దక్కిందని సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు టీడీపీ, ఎంఐఎంలు దూరంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించాయి. మరో పార్టీ బీజేపీ ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు చేయలేదు. దీంతో బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠగా మారింది.
Also Read : BC Reservations: హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నవంబర్ 11, 2025న జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు అభివృద్ధితో పాటు అభ్యర్థుల వ్యక్తిగత చరిత్రతో దృష్టిపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.