Jason Gillespie On Pak: ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. మూడు టెస్టుల సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ చేతిలో అత్యంత దారుణంగా పాకిస్థాన్ ఓడిపోయింది. మరో మ్యాచ్ లో కూడా ఓడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పులకు నాంది పలికింది పీసీబీ. ఇందులో భాగంగానే మొత్తం ఏడుగురు క్రికెటర్లను.. మరో ఇద్దరు కోచింగ్ సిబ్బందిని స్వదేశానికి పంపించింది. వాళ్ల స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చింది. అయితే ఈ సంఘటనపై తాజాగా పాకిస్తాన్ మాజీ కోచ్ జేసన్ గిలెస్పీ (Jason Gillespie) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్యాంట్లు మార్చినట్లుగా కోచ్ లను మార్చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ క్రికెట్ చావు బతుకుల్లో ఉందని.. దాన్ని కాపాడడం ఎవరి తరం కాదు అంటూ బాంబు పేల్చారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పై జేసన్ గిలెస్పీ చేసిన వ్యాఖ్యలు దుమారం వేపుతున్నాయి.
ఒకప్పుడు పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్ గా పనిచేసిన జేసన్ గిలెస్పీ (Jason Gillespie) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు అత్యంత ప్రమాదంలో ఉందని హెచ్చరించారు. ఆ జట్టును కాపాడడం ఎవరి తరం కాదని తేల్చి చెప్పారు. మైదానంలో స్థిరమైన ప్రదర్శన ఉండాలంటే… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. భయాందోళనలో ప్లేయర్లను ఇంగ్లాండ్ కు పంపించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్ద తప్పిదం చేసిందని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు భరోసా నింపడంలో విఫలమైందని మండిపడ్డారు జేసన్ గిలెస్పీ.
ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ ను ఉద్దేశించి కూడా ఓ రేంజ్ లో ఆడుకున్నారు జేసన్ గిలెస్పీ. పాకిస్తాన్ వైఫల్యాలకు గత కోచ్ లు అయినగారీ క్రిస్టెన్, తనను బ్లేమ్ చేయడం సరి కాదని ఫైరయ్యారు. దీనికి బాధ్యత వహిస్తూ ఆకిబ్ జావేద్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇతరులను అనే ముందు అద్దంలో ఒకసారి చూసుకో అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలని.. ప్యాంట్లు మార్చినంత వేగంగా ఆలోచనలు మార్చుకోకూడదని చురకలు అంటించారు జేసన్ గిలెస్పీ. ఇలాగే పాకిస్తాన్ క్రికెట్ జట్టును వదిలేస్తే… వాళ్ల టెస్టు హోదా కోల్పోవడం గ్యారంటీ అని వార్నింగ్ ఇచ్చారు. ఇంగ్లాండ్ గడ్డపై ఆడాలంటే చాలా ఓర్పు కావాలని వెల్లడించారు. ఒక పాకిస్తాన్ కోలుకుంటోందన్న నమ్మకం తనకు లేదని తేల్చి చెప్పారు.