Rayudu on Rahul Dravid: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో భాగంగా ఆదివారం రోజు గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ఆసక్తికర పోరులో సీఎస్కే పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో చెన్నై పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిని చవిచూసింది చెన్నై. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గెలిచిన చెన్నైకి ఇది వరుసగా రెండవ ఓటమి.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం ఓ మోస్తరు లక్ష్య చేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి వరకు పోరాడి ఆరు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వీల్ చైర్ లో కూర్చుని పిచ్ ని పరిశీలించాడు. బెంగళూరులో స్థానిక మ్యాచ్ సందర్భంగా కాలికి గాయం అయిన కారణంగా అతడు వీల్ చైర్ లో పిచ్ ని పరిశీలించాల్సి వచ్చింది.
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు ఈ గాయం బారిన పడిన రాహుల్ ద్రావిడ్.. ఇప్పటికీ కోలుకోకపోవడంతో వీల్ చైర్ లోనే తిరుగుతూ కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్ ప్రారంభమైన అనంతరం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. రాహుల్ ద్రావిడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ ద్రావిడ్ వీల్ చైర్ పై వచ్చి పిచ్ ని పరిశీలించిన నేపథ్యంలో.. వీల్ చైర్ ని మైదానంలోకి ఎలా అనుమతించారని ప్రశ్నించాడు అంబటి రాయుడు. దీంతో అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి.
ఈ వ్యాఖ్యలపై వెంటనే అతడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు రాజస్థాన్ రాయల్స్ క్రీడాభిమానులు. నిజానికి అంబటి రాయుడు మహేంద్రసింగ్ ధోనీకి ఎంత పెద్ద భక్తుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోని కూడా అంబటి రాయుడు విషయంలో అలానే ఉంటాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచిన అనంతరం ధోని ఆ కప్ ని రాయుడికి ఇచ్చాడంటే.. వీరిద్దరి మధ్య రిలేషన్ ఎంత స్ట్రాంగో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే అంబటి రాయుడు ఇటీవలి కాలంలో ధోని, చెన్నై సూపర్ కింగ్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ఇతర జట్లపై ఇలా విమర్శలు చేస్తున్నాడని మండిపడుతున్నారు క్రీడాభిమానులు. ఇక రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సీఎస్కే ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో 16 ఓవర్ ఆఖరి బంతికి క్రీజ్ లోకి వచ్చిన మహేంద్రసింగ్ ధోని.. మ్యాచ్ ని ఫినిష్ చేస్తాడని అంతా భావించారు.
కానీ 17, 18 ఓవర్లు సింగిల్స్ తో నడిపించిన ధోని.. 19వ ఓవర్ లో మాత్రం ఒక ఫోర్, ఒక సిక్సర్ బాదాడు. ఆఖరి ఓవర్ లో ధోని స్ట్రైకింగ్ లో ఉండడం.. సీఎస్కే కి 20 పరుగులు కావాల్సి రావడంతో మిస్టర్ కూల్ గెలిపిస్తాడని అనుకున్నారు. కానీ సీనియర్ బౌలర్ సందీప్ శర్మ వేసిన ఆఫ్ సైడ్ లో ఫుల్ టాస్ బంతిని లెఫ్ట్ సైడ్ లాగి కొట్టడంతో.. హిట్ మేయర్ దాన్ని క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో చెన్నై అభిమానులు ఇక మ్యాచ్ పై ఆశలను వదులుకున్నారు. మొత్తానికి రాహుల్ ద్రావిడ్ పై అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.