IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం పలు ఫ్రాంచైజీలు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ ఏడాది చివర్లో వేలం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఇందుకోసం పలు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. గత సీజన్ లో పేలవ ప్రదర్శన చేసిన జట్లు.. ఈ సీజన్ లో జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నాయి. మరికొన్ని జట్లు తమ బలహీనతలను బలంగా మార్చుకునే ప్రయత్నాలలో ఉన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ కి ముందు ప్లేయర్ ట్రేడ్ లు, రిటైన్ లిస్ట్ పై ఫ్రాంచైజీల మధ్య తీవ్ర చర్చలు సాగుతున్నాయి.
Also Read: Rohit Sharma Weight: ఉదయం 3:30 లేస్తున్న రోహిత్.. మరో 10 కిలోలు తగ్గేందుకు ప్లాన్
ఈ క్రమంలోనే పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. ప్లేయర్ల ట్రేడింగ్ విండో ఓపెన్ అవడంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల బదిలీ కోసం చర్చలు మొదలుపెట్టాయి. 2025 ఐపీఎల్ సీజన్ లో కలకత్తా నైట్ రైడర్స్ కేవలం ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో 2026 మినీ వేలంలో మంచి ప్లేయర్లను తీసుకునేందుకు రెడీ అవుతుంది. అయితే మినీ వేళానికి ముందే ఇతర జట్లలోని ఆటగాళ్లను ట్రేడ్ కి ప్రయత్నిస్తోంది.
కీలక ఆటగాళ్లపై కన్నేసిన కేకేఆర్:
ముఖ్యంగా కలకత్తా నైట్ రైడర్స్.. ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు రోహిత్ శర్మ, ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్, సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్, ఓపెనింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా జట్టు నుంచి ఐదుగురు ప్లేయర్లను రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గత సీజన్ లో అజింక్య రహానేకి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది కేకేఆర్. రహనే కొన్ని మ్యాచ్ లలో మెరుపులు మెరిపించినప్పటికీ.. జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో కేకేఆర్ రోహిత్ శర్మ పై కన్నేసినట్లు తెలుస్తోంది. అలాగే కేకేఆర్ వికెట్ కీపర్, ఓపెనర్ క్వింటన్ డికాక్ గత సీజన్ లో 8 ఇన్నింగ్స్ లలో 21.71 సగటుతో 152 పరుగులు చేశాడు. రూ. 3.6 కోట్లకు డికాక్ ని వేలంలో తీసుకుంది. అయితే రాబోయే సీజన్ కి కేఎల్ రాహుల్ ని జట్టులోకి తీసుకుంటే డికాక్ ప్లేస్ ని భర్తీ చేయవచ్చని కేకేఆర్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
కేకేఆర్ కి కాబోయే కెప్టెన్ ఎవరు..?
కెప్టెన్ అజింక్య రహనే ను వేలానికి ముందు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో రోహిత్ శర్మ లేక కేఎల్ రాహుల్ కి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించే యోజనలో ఉన్నట్లు సమాచారం. ఇక గత సీజన్ లో రిషబ్ పంత్ తర్వాత ఎక్కువగా చర్చ జరిగింది వెంకటేష్ అయ్యర్ గురించి. మెగావేళానికి ముందు రూ. 23.75 కోట్లకు కేకేఆర్ అతడిని రిటైన్ చేసుకుంది. అయితే అతడు 11 మ్యాచులలో 20.29 సగటుతో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మినీ వేలంలో అతడిని రిలీజ్ చేసి.. అతడి స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ని జట్టులోకి తీసుకోవాలని కేకేఆర్ భావిస్తుందని సమాచారం.
అయితే గత సీజన్ వేలంలో 11.25 కోట్లకు కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ ని వదులుకోవడానికి సన్రైజర్స్ హైదరాబాద్ ముఖంగా లేదని ప్రాథమిక చర్చల ద్వారా తెలుస్తోంది. కానీ ఇది పూర్తిగా ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల తుది నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఐపీఎల్ మినీ వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను నవంబర్ 15లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువులోగా కీలక ఆటగాళ్ల డీల్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.