సౌతాఫ్రికాపై సంచలన విజయంతో 2022 T20 వరల్డ్‌కప్‌లో టాప్ 8 టీమ్స్ జాబితాలో నిలిచిన నెదర్లాండ్స్… 2024 T20 వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించింది. బంగ్లాదేశ్ ను వెనక్కి నెట్టి… మేటి జట్లతో పాటు డైరెక్ట్ గా మెగా టోర్నీలో ఆడేందుకు లైన్ క్లియర్ చేసుకుంది. 2024లో వెస్టిండీస్–అమెరికా సంయుక్తంగా T20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వబోతున్నాయి.
ప్రస్తుత T20 వరల్డ్‌కప్‌లో గ్రూప్-1 నుంచి సెమీస్‌కు అర్హత సాధించిన న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో పాటు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, శ్రీలంక… నేరుగా 2024 T20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. ఇక గ్రూప్-2 నుంచి సెమీస్ చేరిన భారత్, పాకిస్తాన్‌తో పాటు మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా, నాలుగో స్థానానికి ఎగబాకిన నెదర్లాండ్స్ కూడా 2024 T20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు అర్హత సాధించాయి.
సౌతాఫ్రికాతో మ్యాచ్ కు ముందు నెదర్లాండ్స్ జింబాబ్వేపై మాత్రమే గెలిచి… కేవలం 2 పాయింట్లతో ఉంది. ప్రొటీస్ పై అనూహ్య విజయంతో మరో 2 పాయింట్లు సాధించి… మొత్తం 4 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. పాకిస్థాన్ చేతిలో ఓడిపోయిన బంగ్లాదేశ్ కూడా 4 పాయింట్లతో నిలిచినా… రన్ రేట్ లో మాత్రం నెదర్లాండ్స్ కంటే వెనుకబడిపోయింది. సూపర్-12 మ్యాచ్ ముగిసేసరికి బంగ్లా -1.176 రన్ రేట్ తో 4 పాయింట్లతో ఉంటే… నెదర్లాండ్స్ -0.849 రన్ రేట్ తో 4 పాయింట్లతో ఉంది. దాంతో… బంగ్లాకన్నా మెరుగైన రన్ రేట్ కలిగిన నెదర్లాండ్స్… వచ్చే T20 వరల్డ్‌కప్‌లో నేరుగా పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది. ఆ టోర్నీకి ఆతిథ్య దేశాల హోదాలో వెస్టిండీస్, అమెరికా కూడా అర్హత పొందాయి. అలాగే ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా… ప్రస్తుతం తొమ్మిది, పది ర్యాంకుల్లో నిలిచిన బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ కూడా 2024 వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాయి. 20 జట్లు పాల్గొననున్న ఆ టోర్నీలో… మిగతా 8 బెర్త్‌లు రీజినల్ క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా ఖరారవుతాయి.