Siddu Jonnalagadda: కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. నెమ్మదిగా హీరోగా మారి.. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గామారిపోయాడు సిద్దు. ఆ తరువాత ఆ సినిమాకే సీక్వెల్ టిల్లు స్క్వేర్ చేసి మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ రెండు సినిమాలతో సిద్దు మంచి స్టార్ హీరో అయిపోతాడు అనుకున్నారు. కానీ ఈ సినిమాల తరువాత వచ్చిన జాక్ భారీ డిజాస్టర్ అయ్యింది.
ఇక జాక్ ద్వారా నష్టపోయిన నిర్మాతలకు సిద్దు తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసి మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం సిద్దు వరుస సినిమాలతో బిజీగా మారాడు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్ గా మారి చేస్తున్న చిత్రం తెలుసు కదా. సిద్దు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మల్లికా గంధ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం తెల్సిందే.
SIIMA 2025: సైమా 2025.. విజేతలు వీరే
ఇక తెలుసు కదా సినిమా తరువాత సిద్దు మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మగజాతి ఆణిముత్యం అనే టైటిల్ ను ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట. ఆ టైటిల్.. సిద్దు కోసమే అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు.. ? ఏ బ్యానర్ లో చేస్తున్నాడు.. ? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
డీజే టిల్లు రెండు పార్ట్స్ లో అమ్మాయిల చేతిలో మోసపోయే హీరోగా సిద్దు కనిపించాడు. ఇక మగజాతి ఆణిముత్యం సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ నే ఉండబోతుందని, అందుకే సిద్దునే ఎంచుకున్నారని, తనకు అచ్చొచ్చిన కథ కాబట్టి సిద్దు కూడా ఓకే చేశాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సిద్దు కనుక మగజాతి ఆణిముత్యం కాకపోతే.. ఆ టైటిల్ కు యాప్ట్ అయ్యే హీరో ఎవరై ఉంటారు అనేది చూడాలి.