SA vs USA Match Highlights : టీ 20 ప్రపంచకప్ లో సూపర్ 8 దశ మొదలైంది. తొలి మ్యాచ్ లోనే మరో సంచలనం నమోదవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అమెరికా వారికి ముచ్చెమటలు పట్టించింది. ఓపెనర్ ఆండ్రిస్ గౌస్ (80 నాటౌట్) అద్భుతంగా ఆడి శభాష్ అనిపించాడు. చివరికి అమెరికా ఓడినా అందరి ప్రశంసలు అందుకుంది.
ఆంటిగ్వాలోని వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో అమెరికా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య తొలి సూపర్ 8 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన అమెరికా బౌలింగు తీసుకుంది. దీంతో సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ కి వచ్చి… 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అమెరికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 18 రన్స్ తేడాతో పరాజయం పాలైంది.
వివరాల్లోకి వెళితే… 195 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన అమెరికా కి ఓపెనర్లు అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చారు. స్టీవెన్ టేలర్ మొదటి బాల్ నే ఫోర్ కొట్టి తమ ఉద్దేశాన్ని ఘనంగా చాటి చెప్పాడు. అలా 14 బంతుల్లో 1 సిక్స్, 4 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
మరో ఓపెనర్ ఆండ్రిస్ గౌస్ అద్భుతంగా ఆడాడు. విజయం కోసం చివరి బంతి వరకు పోరాడాడు. ఒకవైపు వికెట్లు పడిపోతుంటే, జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డుని కదిలించాడు. తర్వాత 13 ఓవర్ నుంచి గేర్ మార్చి, ఉతకడం మొదలుపెట్టాడు. అలా 47 బంతుల్లో 5 సిక్స్ లు, 5 ఫోర్ల సాయంతో 80 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
Also Read : పాక్ లోనే కాదు..ఇండియాలోనూ అంతే..! భారత క్రికెటర్లకు చేదు అనుభవాలు
మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా చివర్లో ఒత్తిడి ఎక్కువైంది. ముఖ్యంగా నితీష్ కుమార్ (8), ఆండర్సన్ (12), శయన్ జహంగీర్ (3) ఇలా చేసి అవుట్ అయిపోయారు..అయితే సూపర్ 8కి రావడంలో కీలకపాత్ర పోషించిన ఆరోన్ జోన్స్ డకౌట్ అవడంతో అమెరికా ఓటమి కన్ ఫర్మ్ అయ్యింది.
అయితే హర్మీత్ సింగ్ అద్భుతంగా ఆడి, గెలుపుపై ఆశలు రేపాడు. 22 బంతుల్లో 3 సిక్స్ లు, 2 ఫోర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. తను ఉన్నంత సేపు సౌతాఫ్రికాకి కంటి మీద కునుకు లేదు. మొత్తానికి రబడ బౌలింగులో అవుట్ కావడంతో వాళ్లు ఊపిరి తీసుకున్నారు. అదే టర్నింగ్ పాయింట్ గా మారింది. మ్యాచ్ అమెరికా చేయి జారిపోయింది.
ఇక చివరి ఓవర్…6 బంతుల్లో 26 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో 18 పరుగుల తేడాతో అమెరికా ఓటమి పాలైంది. మొత్తానికి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి అమెరికా 176 పరుగులు మాత్రమే చేసింది.
సౌతాఫ్రికా బౌలింగులో రబడ 3, కేశవ్ మహరాజ్ 1, అన్రిచ్ 1, షంసి 1 వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాకి ఓపెనర్ రిజా హాండ్రిక్స్ (11) త్వరగా అయిపోయినప్పటికి, మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ విశ్వరూపం చూపించాడు. 40 బంతుల్లో 5 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అలా తను మొదటి ఓవర్ నుంచి ఇచ్చిన పికప్ ని, కెప్టెన్ మార్ క్రమ్ మరింత ముందుకు తీసుకువెళ్లాడు. తను 32 బంతుల్లో 1 సిక్స్, 4 ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా స్కోరు బోర్డుని ఇద్దరూ పరుగులెత్తించారు. అమెరికన్ బౌలర్లు వీరిని కంట్రోల్ చేయలేకపోయారు.
అయితే క్వింటన్ డికాక్ ఇలా అవుట్ అయిన వెంటనే, మరుసటి బంతికి డేవిడ్ మిల్లర్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఒక్కసారి అమెరికన్ శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి. తర్వాత వచ్చిన క్లాసెన్ వారి ఆశలపై నీళ్లు జల్లాడు. 22 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అలాగే స్టబ్స్ (20 నాటౌట్) సాయంతో స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. మొత్తానికి సౌతాప్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు చేసింది.
అమెరికా బౌలింగులో నేత్రావల్కర్ 2, హర్మీత్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు.