Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. కోకోవన్ బ్యాటరీ నంబర్ 5లో మంటలు చెలరేగాయి. వేడి ఉక్కు ద్రావకాన్ని లేడిల్‌ల ద్వారా కన్వర్టర్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ కార్మికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం జరగలేదు. అయితే ఆస్తి పరంగా పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
కొద్ది క్షణాల్లోనే మంటలు వ్యాప్తి చెందడంతో.. ఆ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వెంటనే అలారం మోగించారు. దీంతో అప్రమత్తం అయిన యాజమాన్యం.. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
మంటలు ఎగసిపడుతున్న సమయంలో.. ప్లాంట్ లోని కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఉక్కు ద్రావకం నేలపై పడి.. పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతం అంతా పొగతో నిండిపోయింది. దీంతో మంటలను అదుపు చేయడం కొంత కష్టంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో ఆ విభాగంలో సుమారు 25 మంది కార్మికులు పనిచేస్తున్నారు. లేడిల్ లీక్ అవడంతో వెంటనే వారు బయటకు పరుగులు తీసి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఇద్దరు కార్మికులు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: పాడుబడ్డ బంగ్లాలో డ్రగ్స్ తీసుకుంటూ.. ఇద్దరు యువకులు అరెస్ట్
ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని అధికారులు మూసివేశారు. ఉత్పత్తి లైన్‌ను తాత్కాలికంగా నిలిపి, మరమ్మత్తు పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.. సాంకేతిక నిపుణులు కోకోవన్ బ్యాటరీ మొత్తం సిస్టమ్‌ను రీసెట్ చేయడానికి చర్యలు చేపడుతున్నారు.