Sunil Gavaskar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL 2025} 18వ సీజన్ ఊహించిన దాని కంటే రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుంది. ఈ సీజన్ లో కొందరు ఆటగాళ్లు కొత్త రికార్డులను నెలకొల్పుతుంటే.. మరి కొంతమంది ఆటగాళ్లు ప్రవర్తన, స్లో ఓవర్ రేట్ల విషయంలో కొన్ని నియమాల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేష్ రాఠి ఈ సీజన్ లో ఇప్పటివరకు రెండుసార్లు జరిమానాకి గురయ్యాడు.
వరుసగా పంజాబ్, ముంబై తో జరిగిన మ్యాచ్ లలో అతడు వికెట్ తీసిన తర్వాత నోటుబుక్ సంబరాలు చేసుకోవడం కాంట్రవర్సీకి దారితీసింది. దీంతో అతడు ఐపిఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించాడని భావించిన అడ్వైజరీ కమిటీ తొలిసారి అతడికి 25%, రెండవసారి 50% మ్యాచ్ ఫీజు లో కోత విధించారు. ఈ నేపథ్యంలో దిగ్వేష్ మొత్తం 50 లక్షలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే గత సంవత్సరం జరిగిన మెగా వేలంలో దిగ్వేశ్ ని లక్నో 30 లక్షలకు కొనుగోలు చేసింది.
ఈ క్రమంలో జరిమానా అనేది 50 లక్షలు అంటూ ప్రచారం సాగుతోంది. శాలరీ కంటే ఎక్కువ ఫైన్ ఎలా కడతాడు..? అంటూ నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రెండు డీ మెరిట్ పాయింట్లు కూడా దిగ్వేష్ ఖాతాలో చేరాయి. ఈ నేపథ్యంలో రెండవసారి దిగ్వేశ్ కి ఫైన్ ఎందుకు వేశారు అంటూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీని ప్రశ్నించారు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. దిగ్వేశ్ పై ఇలా జరిమానా విధించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు.
సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ” దిగ్వేష్ పై రెండు సార్లు ఫైన్ పడింది. అలాగే రెండు డీ మెరిట్ పాయింట్ లు కూడా దిగ్వేష్ ఖాతాలో చేరాయి. మొదటిసారి వికెట్ తీసినప్పుడు నోట్ బుక్ పై సంతకం చేసినట్లు అతడు సంబరాలు చేసుకున్నాడు. ఢిల్లీ సహచరుడు ప్రియాంశ్ ఆర్య అవుట్ అయినప్పుడు అతడి వద్దకు వెళ్లి సంబరాలు చేసుకున్నాడు. అప్పుడు జరిమానా విధించడం సరైందే. కానీ రెండవసారి 50% వేయడం మాత్రం సరైంది కాదు.
నాకు మాత్రం రెండవసారి అతడికి 50% జరిమానా విధించడం సరైనదిగా అనిపించలేదు. రెండవసారి అతడు బ్యాటర్ వద్దకు వెళ్లి అలా ప్రవర్తించలేదు. వికెట్ పడిన తర్వాత అక్కడే నేల మీద సంతకం చేసినట్లు దిగ్వేష్ సంబరాలు చేసుకున్నాడు. ఇందులో ఇబ్బందికరం ఏం లేదు. రెండవసారి ఎవరి వద్దకు వెళ్లకుండా అతడు ఉన్నచోటే సెలబ్రేట్ చేసుకుంటే మళ్ళీ ఎందుకు జరిమానా విధించారు. దాని అవసరం ఏముంది” అని ప్రశ్నించాడు సునీల్ గవాస్కర్.
అయితే 2025 ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కి ఆటగాళ్లకు 7 లక్షల 50 వేల ఫీజు అందించాలని బిసిసిఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఉన్న ఆటగాడికి ఈ ఫీజు అందుతుంది. అందులో నుండే ప్లేయర్లు జరిమానాలు చెల్లిస్తారు. ఈ లెక్కన దిగ్వేష్ కూడా తన 7.5 లక్షల ఫీజు నుండే ఫైన్ చెల్లిస్తాడు. తొలిసారి 25% కోత అంటే.. 1.87 ఫైన్ కడతాడు. రెండవసారి 50% అంటే 3.75 లక్షలు జరిమానా చెల్లిస్తాడు. అంటే దిగ్వేజ్ సెలబ్రేషన్స్ ఖరీదు దాదాపు 6 లక్షలు.