
Virender Sehwag on India team jersey(Indian cricket news today) :
కేంద్రం ఇండియా పేరును భారత్‌గా మారుస్తుందనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈ అంశంపై సినీ, క్రీడా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. బాలీవుడ్ లెజెండ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భారత్ మాతాకీ జై అని చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా క్రికెటర్ లెజెండ్ సునీల్ గావస్కర్ కూడా ఈ అంశంపై స్పందించారు. మన దేశం అసలు పేరు భారత్ అని పేర్కొన్నారు. భారత్ అనే పదం వినడానికి కూడా బాగుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
బీసీసీఐ స్థాయిలో మన జట్టును భారత్ క్రికెట్ టీమ్ అని పిలవాలని గవాస్కర్ కోరారు. గతంలో చాలా దేశాల పేర్లు మారాయని వివరించారు. బర్మాను ఇప్పుడు మయన్మార్ అని పిలుస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. మన దేశం కూడా పేరు మారొచ్చు అని అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో పెద్దగా ఇబ్బంది ఉన్నట్లు కనిపించడం లేదని చెప్పారు. కానీ అన్నిస్థాయిల్లో భారత్ అని మారాలని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు.
అంతకుముందు మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇండియా పేరు మార్పుపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు. త్వరలో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు బదులు టీమ్‌భారత్ జెర్సీలతో మన ఆటగాళ్లు బరిలోకి దిగాలని తేల్చిచెప్పాడు. చాలా దేశాలు అసలు పేరుకు మారిన విషయాన్ని గుర్తు చేశాడు.
మనలో గర్వాన్ని నింపేలా పేరు ఉండాలని ఎప్పుడూ నమ్ముతాని సెహ్వాగ్ అన్నాడు. బ్రిటీషు వాళ్లు పెట్టిన పేరు ఇండియా అని మన అసలు పేరు భారత్ అధికారికంగా తిరిగి రావడానికి చాలాకాలం పట్టిందన్నాడు. ఈ ప్రపంచకప్‌లో మన క్రికెటర్ల జెర్సీపై భారత్ ఉండేలా చూడాలని బీసీసీఐ కార్యదర్శి జై షాను కోరాడు. 1996లో నెదర్లాండ్స్ ప్రపంచకప్ ఆడేందుకు హాలెండ్ పేరుతో భారత్‌కు వచ్చిన విషయాన్ని సెహ్వాగ్ ప్రస్తావించాడు. 2003లో నెదర్లాండ్స్‌గా మారిందని వివరించాడు. ఇలా సినీస్టార్స్, క్రికెట్ లెజెండ్స్ ఇండియా పేరును భారత్ గా మార్చే అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.