Mohan Babu University: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu) శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను ఎంతో విజయవంతంగా నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా మోహన్ బాబు యూనివర్సిటీ గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ (APSCHE)ఊహించని షాక్ ఇస్తూ రూ.26 కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు యూనివర్సిటీలో గత మూడు సంవత్సరాలుగా విద్యార్థుల నుంచి సుమారు 26 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించారని విద్యా కమిషన్ సీరియస్ అవుతూ భారీ స్థాయిలో యూనివర్సిటీకి జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ విషయంపై హైకోర్టు మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరటను కల్పించింది. విద్యా కమిషన్ చర్యలపై వర్సిటీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే విధించింది. మోహన్ బాబు యూనివర్సిటీ అడ్మిన్ బాధ్యతలు అన్నింటిని కూడా ఎస్వీయూ యూనివర్సిటీకి అప్పగించాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను కూడా నిలిపివేసింది. అదేవిధంగా కోర్టు ఆదేశాలు వెలువడనప్పటికీ ఉత్తర్వులను విద్యా కమిషన్ వెబ్ సైట్ లో బహిరంగంగా పెట్టడం పై విద్యా కమిషన్ ను మందలించింది. అదేవిధంగా కోర్టు వెల్లడించిన ఉత్తర్వులను అప్లోడ్ చేయాలని కూడా ఆదేశాలను జారీ చేసింది. ఇలా హైకోర్టు ఉత్తర్వులతో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే.
మోహన్ బాబు యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి అదనపు ఫీజులను రాబడుతున్నారు అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ ఈ ఆరోపణలపై విచారణ జరిపించారు. అయితే ఇవి చారణలో ఇది నిజమని తేలడంతో పెద్ద ఎత్తున జరిమానా విధించింది. అదేవిధంగా యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేస్తామంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ తరుణంలోనే మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో కాస్త గందరగోళ వాతావరణం కూడా ఏర్పడింది..
తప్పుడు వార్తలను నమ్మొద్దు..
యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారనే విషయంపై విద్యా కమిషన్ చర్యలు తీసుకోవడంతో మంచు విష్ణు ఈ విషయంపై స్పందిస్తూ బహిరంగ ప్రకటన కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమ యూనివర్సిటీ గురించి మీడియాలో వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని, ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ ఈ వార్తలను ఖండించారు. అదేవిధంగా విద్యా కమిషన్ తీసుకున్నటువంటి చర్యలపై తాము కోర్టుకు వెళ్ళామని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని విష్ణు తెలిపారు. అయితే తాజాగా కోర్టు ఈ విషయంలో యూనివర్సిటీకి ఊరట కల్పిస్తూ విద్యా కమిషన్ పై సీరియస్ అయ్యారు. ఇలా కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో మోహన్ బాబు యూనివర్సిటీకి ఊరట లభించింది.