Telangana : పాపం.. ఘోరం.. దారుణం. బతికుండగానే శ్మశానానికి తరలించిన ఘటన. పేదరికం ఎంత దుర్మార్గమైనదో చెప్పడానికి ఇదే ఉదాహరణ. సొంత ఇల్లు లేకపోవడం ఎంతటి చేదు అనుభవాన్ని చూపిస్తుందో చెప్పే దుర్ఘటన. తెలంగాణ, జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఈ హృదయవిదారక విషయం చోటుచేసుకుంది. ఆరోగ్యం విషమించిన ఓ వ్యక్తిని బతికుండగానే శ్మశానానికి తరలించిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రాణాలతోనే శ్మశానానికి..
ధర్మపురికి చెందిన రంగు గోపి అనే యువకుడు తన చెల్లితో కలిసి హోటల్ నడుపుతున్నాడు. అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్నాడు. చికిత్స ఫలించక ఆయన పరిస్థితి విషమించింది. వైద్యులు ఇక లాభం లేదని.. ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు. అయితే, గోపికి సొంత ఇల్లు అంటూ ఏదీ లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అదే ఇంటికి అతన్ని తీసుకెళ్లారు. కానీ, ఇంట్లోకి రానివ్వడానికి ఆ హౌజ్ ఓనర్ ఒప్పుకోలేదు. చనిపోతే తన ఇంటికి అరిష్టమని.. ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లిపోండని బెదిరించాడు. ఎక్కడికని పోతారు? అంత దగ్గరి బంధువులు కూడా ఎవరూ లేరు. ఉన్నా వాళ్లు కూడా రానివ్వరు. ఏం చేయాలో తెలీలేదు వాళ్లకు. ఎలాగూ చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. ఇవాళో రేపో అంటున్నారు కదాని.. గత్యంతరం లేక.. బతికుండగానే గోపిని శ్మశానానికి తరలించారు కుటుంబ సభ్యులు.
కాపు కాశారు..
శ్మశానంలో వారి దీనస్థితిని చూసి మున్నూరు కాపు సంఘ సభ్యులు స్పందించారు. వారి కమ్యూనిటీ బిల్డింగ్‌లో ఉండేందుకు అనుమతించారు. గోపిని ప్రస్తుతం కాపు భవనంలో ఉంచారు. విషయం తెలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తన వంతు సాయంగా రూ.10వేలు స్థానిక నాయకుల ద్వారా అందజేశారు. సొంత ఇల్లు లేక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు అయినా ఇప్పించాలని వేడుకుంటున్నారు.