నారా లోకేష్ ఏ విషయాన్నీ అంత తేలిగ్గా వదిలిపెట్టరు. చినబాబు చిరుతిండి అనే పేరుతో అప్పుడెప్పుడో సాక్షిలో వచ్చిన ఓ ఆర్టికల్ విషయంలో ఇప్పటికీ ఆయన కోర్టుకి హాజరవుతున్నారు. పరువునష్టం కేసులో సాక్షిని ముప్పతిప్పలు పెడుతున్నారు. తాజాగా మరోసారి లోకేష్ పై అలాగే నోరు పారేసుకుని మరోసారి వైసీపీ బ్యాచ్ అడ్డంగా బుక్కైంది. ఈసారి తల్లికి వందనం పథకం విషయంలో లోకేష్ పై ఆరోపణలు చేశారు జగన్ అండ్ టీమ్. అయితే ఈ ఆరోపణలను సవాల్ చేస్తూ లోకేష్ వారికి 24గంటలు టైమ్ ఇచ్చారు. ఆ లోగా నిరూపించలేకపోతే తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ గడువు పూర్తవడంతో మరోసారి ఘాటు ట్వీట్ చేశారు లోకేష్. సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్..! అంటూ కౌంటర్ ఇచ్చారు. బురదజల్లడం, ఆ తర్వాత పోయి ప్యాలెస్ లో దాక్కోవడం జగన్ కి అలవాటేనన్నారు.
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్!
బురద చల్లడం పారిపోయి ప్యాలెస్లో దాక్కోవడం @ysjagan గారికి అలవాటు. తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేసాను. సమయం ముగిసింది, రుజువు చెయ్యలేదు, క్షమాపణ కోరలేదు. అందుకే… pic.twitter.com/dCqkwaGs4g
— Lokesh Nara (@naralokesh) June 14, 2025
సమరమా..? శరణమా..?
రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు చాలా సహజం. కానీ ఆ సవాళ్లపై నిలబడేవారేవ అరుదు. సవాల్ విసిరిన లోకేష్ వైరి వర్గానికి 24 గంటలు టైమ్ ఇచ్చి మరీ రుజువు చేయాలని కోరారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయలేకపోవడంతో మరోసారి తెరపైకి వచ్చారు. “సమయం ముగిసింది, రుజువు చెయ్యలేదు, క్షమాపణ కోరలేదు. అందుకే మిమ్మల్ని ఫేకు జగన్ అనేది. లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సమయం లేదు మిత్రమా! శరణమా..న్యాయ సమరమా? తేల్చుకోండి..” అని హాట్ కామెంట్స్ చేశారు లోకేష్.
ఆ 2వేలే కీలకం..
తల్లికి వందనం పథకంలో ప్రభుత్వం ఇచ్చే రూ.15వేలలో 2వేలు స్కూల్ అభివృద్ధికోసం కట్ చేస్తున్నారు. ఆ 2వేలు లోకేష్ జేబులోకి వెళ్తున్నాయనేది వైసీపీ ఆరోపణ. ఆ ఆరోపణ నిరూపించాలని లోకేష్ సవాల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కూడా పథకం కింద అందే లబ్ధిలో రూ.2వేలు కట్ చేసేవారు. ఇప్పుడు కూడా అదే పద్ధతి కంటిన్యూ అయింది కానీ, ఇక్కడ లోకేష్ కానీ, కూటమి ప్రభుత్వం కానీ కొత్తగా తెచ్చిన నిబంధన ఏదీ లేదు. మరి వైసీపీకి వచ్చిన సమస్య ఏంటి..? నిన్నటి వరకు అసలు తల్లికి వందనం మొదలే కాలేదని విమర్శించారు. ఇప్పుడు ఆ 2వేలు ఎటు పోయాయంటూ కొత్త లాజిక్ తీస్తున్నారు. వైసీపీ హయాంలో ఆ 2వేలు ఎటువెళ్లాయో చెప్పి, ఆ తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తే బాగుండేది.
గత ప్రభుత్వ హయాంలో రూ.2వేలు మినహాయించుకున్నా వాటిని సక్రమంగా వినియోగించలేదని కూటమి నేతలు అంటున్నారు. తమ హయాంలో మినహాయించిన సొమ్ముతో ఏం చేయగలమో చేసి చూపిస్తామని చెబుతున్నారు. స్కూల్స్ అభివృద్ధిని కళ్లముందు చూపెడతామంటున్నారు. ప్రతి రూపాయికీ లెక్క ఉంటుందని ధీమాగా చెబుతున్నారు. అయితే తల్లికి వందనం అమలుని ఊహించని వైసీపీ.. కొత్త ఆరోపణలతో కూటమిపై బురదజల్లాలని చూస్తోంది. అయితే లోకేష్ ఘాటుగా రియాక్ట్ కావడంతో మరోసారి సైలెంట్ అయింది. యథావిధిగా జగన్ ఏపీ పర్యటన ముగించుకుని బెంగళూరు వెళ్లిపోయారు.