– మంత్రుల సొంత ఊళ్లలోనే రైతులకు అన్యాయం
– హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం
– రైతుల సంక్షేమానికి విరుద్ధంగా తుమ్మల వ్యాఖ్యలు
– బీజేపీ ఎప్పుడూ కుర్చీల కోసం కొట్లాడుకోదు
– హైడ్రాతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారు
– ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి
– బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్, స్వేచ్ఛ: రైతులకు కనీస భరోసా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలలో కాంగ్రెస్ అనేక హామీలిచ్చి గద్దెనెక్కిందని గుర్తు చేశారు. హామీల అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయిందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను పక్కదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి విరుద్ధంగా పనిచేస్తోందన్న ఏలేటి, సొంత జిల్లాలోనే రైతులకు పంట నష్టాన్ని ఇప్పించలేని స్థితిలో తుమ్మల ఉన్నారని కామెంట్ చేశారు. రుణమాఫీపై ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎంఎస్‌పీ పెంచి రైతుల ఆదాయాన్ని పెంచిందని తెలిపారు. బీజేపీ ఎప్పుడూ పదవుల కోసం, కుర్చీల కోసం కొట్లాడే పార్టీ కాదని అన్నారు. అలాంటి వారంతా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారని చురకలంటించారు.
Also Read: కేటీఆర్.. నువ్వు మగాడివైతే.. రెచ్చిపోయిన సీతక్క
ఇప్పటికైనా రైతు రుణ మాఫీపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఏలేటి. ఎంతమందికి రైతు రుణమాఫీ జరిగిందో ప్రకటించాలని అన్నారు. బీజేపీ చేసిన దీక్షలతోనే ప్రభుత్వం మరో రూ.13 వేల కోట్లు రైతు రుణ మాఫీకీ కేటాయించిందని చెప్పారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో తుమ్మలకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. తుమ్మలకు రైతులపై అవగాహన లేదని, రుణ మాఫీపై ఇచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ కాంగ్రెస్ సర్కార్ అక్రమ వసూళ్లకు పాల్పడుతోందని చెప్పారు. హైడ్రా కూల్చివేతలతో పేదలు, మధ్యతరగతి వారు భయపడుతున్నారని, ఢిల్లీకి కప్పం కట్టేందుకే దీన్ని తెరమీదకు తెచ్చారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.