
Amit Shah: బీజేపీ పాలిటిక్స్ మామూలుగా ఉండవు. మైండ్‌గేమ్‌తో ఆటాడుకుంటారు. వాళ్లు చేసే ప్రతీ పనిలోనూ ఏదో ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ ఉండకపోదు. అది మోదీ అయినా, అమిత్‌షా అయినా. సినీ పాలి-ట్రిక్స్‌లోనూ వాళ్ల తర్వాతే ఎవరైనా.
గతంలో ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనకు వెళ్లినప్పుడు సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇంటికి వెళ్లి కలిశారు. ఇంటి బయట ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక అంతే. తమిళనాట అది హాట్ టాపిక్ అయి కూర్చుంది. తలైవా బీజేపీలో చేరబోతున్నారని.. ఆయన కాషాయ పార్టీకి మద్దతు తెలిపారని.. ఇలా ప్రచారం హోరెత్తింది. బీజేపీకి కావలసింది అదే. మోదీని రజినీకాంత్ తన ఇంటికేమీ ఆహ్వానించలేదు. ప్రధానినే ఆయన ఇంటికెళ్లారు. ఎందుకెళ్లారంటే?.. ఊరికే వెళ్లారు. అట్లుంటది బీజేపీతోని.
సేమ్ స్ట్రాటజీ తెలంగాణలోనూ అప్లై చేస్తున్నారు కమలం పెద్దలు. గత ఎన్నికల సమయంలో “వై కట్టప్ప కిల్డ్ బాహుబలి” డైలాగ్‌ను ఎన్నికల ప్రచారంలో వాడేసుకున్నారు మోదీ. ఆ తర్వాత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ను రాజ్యసభకు నామినేట్ చేశారు. RRR మూవీ ఇండియావైజ్ బ్లాక్ బస్టర్ కావడంతో.. అప్పటినుంచి ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ చుట్టూ తిరుగుతున్నారు కమలనాథులు.
గతేడాది హైదరాబాద్ వచ్చిన అమిత్‌షా కొమురంభీం ఎన్టీఆర్‌ను హోటల్‌కు పిలిపించుకుని ముచ్చటించారు. ఆ ఫోటోలు, వీడియోలకు ఫుల్ క్రేజ్ వచ్చింది. నాటు నాటుకు ఆస్కార్ వచ్చాక.. చిరంజీవి, రాంచరణ్‌లు వెళ్లి ప్రధానిని కలిసొచ్చారు. కట్ చేస్తే.. మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు అమిత్‌షా. ఈసారి మొత్తం RRR టీమ్‌తో హోల్‌సేల్‌గా ముచ్చటించనున్నారు. ఆస్కార్ వచ్చినందుకు అభినందించేందుకే ఈ మీటింగ్ అని చెబుతున్నారు. కారణం అదే అయినా.. ఆ మీటింగ్ వల్ల బీజేపీకి రావాల్సినంత పొలిటికల్ మైలేజ్ వస్తుందని అంటున్నారు. హీరోలు, డైరెక్టర్ల అభిమానులను తమ ఖాతాలో కలిపేసుకునేందుకే బీజేపీ నేతలు మొదటినుంచీ ఇలాంటి ఎత్తుగడలు అమలు చేస్తుంటారనే వాదన ఉంది. ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చినప్పుడు హీరో నితిన్‌ను కలవడం కూడా అందులో భాగమేనంటున్నారు. మరి, నితిన్ ఏ సినిమా హిట్ అయిందని ఆయన్ను నడ్డా పిలిపించుకున్నారో ఆయనకే తెలియాలంటున్నారు. ప్రతిపక్షాలు అనేకసార్లు బీజేపీ పాలి..ట్రిక్స్‌పై ఘాటు కామెంట్స్ చేశాయి.