
Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై ఇటు కమలనాథులు, అటు కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో పోరాడుతున్నారు. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య అంతగా యుద్ధ వాతావరణం ఏమీ లేదు. జాతీయ స్థాయిలో టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నా.. తెలంగాణలో మాత్రం కాస్త ఫ్రెండ్లీ మ్యాచే అని చెప్పాలి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపునకు కాంగ్రెస్ పరోక్షంగా సహకరించిందనే విమర్శ ఉంది. అయితే, మునుగోడు బై పోల్‌లో మాత్రం కాంగ్రెస్.. బీఆర్ఎస్‌కు అనుకూలంగా పని చేసిందంటూ సంచలన కామెంట్లు చేశారు ఈటల రాజేందర్.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని.. ఒకే నాణేనికి ఉన్న బొమ్మ, బొరుసు అన్నారు ఈటల. ఎన్నికల ముందో, తరువాతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుస్తాయని ఆరోపించారు. ఇలా విమర్శలు చేసే క్రమంలో మాట జారారో.. లేదంటే కావాలనే అన్నారో కానీ.. ఓ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేసీఆర్ 25 కోట్లు ఇచ్చారంటూ కలకలం రేపారు ఈటల రాజేందర్.
ఇప్పటికే ఆ రెండు పార్టీలు ఒక్కటేనంటూ బీజేపీ పదే పదే ఆరోపిస్తూ పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతోంది. ఒకే విషయాన్ని పదిసార్లు చెబుతుంటే.. ప్రజలు కూడా అది నిజమే అనుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో.. కేసీఆర్ నుంచి కాంగ్రెస్ 25 కోట్లు తీసుకున్నారని ప్రచారం జరిగితే అది మరింత డేంజర్. అందుకే, ఈటల ఇలా అన్నారో లేదో.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెంటనే రియాక్ట్ అయ్యారు. పదునైన విమర్శలతో ఈటలకు సవాల్ చేశారు.
మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి కార్యకర్తలు చందాలు వేసుకొని ఇచ్చారన్నారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ నుంచి తాము ఎలాంటి సొమ్ము తీసుకోలేదని.. ఈ విషయంపై భాగ్యలక్ష్మి అమ్మవారిపై ఒట్టేసి తడిబట్టలతో ప్రమాణం చేస్తానన్నారు. దమ్ముంటే ఈటల ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు.
అయితే, రేవంత్ కౌంటర్‌తో ఈటల డిఫెన్స్‌లో పడినట్టున్నారు. ఆధారాలు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి? 25 కోట్లకు లెక్కా పత్రం ఏమైనా ఉంటుందా? అంటూ లైటర్ మోడ్‌లో మాట్లాడారు.
మరోవైపు, ఇదే ఛాన్స్‌గా బీఆర్ఎస్ సైతం మధ్యలో దూరింది. హుజురాబాద్ ఎమ్మెల్యే కేండిడేట్ కౌశిక్‌రెడ్డి మరో ఆసక్తికర కామెంట్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలనే.. రేవంత్‌రెడ్డిని 25 కోట్లకు కొన్నారని.. ఆ సొమ్ములో తేడాలొచ్చే.. ఇప్పుడిలా బయటపడుతున్నారని నిప్పులో ఉప్పు వేశారు. అది చిటపట మండుతోంది.
ఇక, శనివారం సాయంత్రమే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టారు రేవంత్‌రెడ్డి. మరి, రేవంత్ సవాల్‌ను ఈటల స్వీకరిస్తారా? చార్మినార్ చౌరస్తాకు రాజేందర్ వస్తారా? భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేస్తారా? లేదంటే, ఎప్పటిలానే పోలీసులు అడ్డుకోవడం, గృహనిర్బంధం గట్రా జరుగుతుందా? పొలిటికల్ టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతోంది.