BRS Party: వరుస పరాజయాలు మూటగట్టుకున్న గులాబీపార్టీలో నెలకొన్ని వివాదాలు, ఆధిపత్యపోరు ఆ పార్టీ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది… కారు పార్టీని తిరిగి రేసులోకి తీసుకురావాల్సిన పార్టీ ముఖ్యనేతలు, అందులోనూ కల్వకుంట్ల వారసులు వ్యవహరిస్తున్న తీరు బీఆర్ఎస్ వర్గాకు అసలు మింగుడుపడటం లేదంట… తాజాగా కవిత జాగృతి వర్సెస్ పార్టీ అనుభంద సంస్థ బీఆర్ఎస్వీ….పోటాపోటీగా ఓకే రోజూ శిక్షణా తరగతులు, వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం పార్టీలో తీవ్ర గందరగోళంగా తయారైందంట.
జాగృతి వర్సెస్ బీఆర్ఎస్వీగా మారిన ఆధిపత్యపోరు
బీఆర్ఎస్‌లో ఆధిపత్యపోరు జాగృతి వర్సెస్ బీఆర్ఎస్వీగా మారిందా అనే చర్చ స్టార్ట్ అయిందట. రెండు విభాగాలు వేర్వేరు అంశాలపై పోటాపోటీ శిక్షణా తరగతులకు సిద్ధమవ్వడం పార్టీ శ్రేణులను కన్‌ఫ్యూచన్‌లోని నెడుతోందంట. . ఒకే రోజూ జాగృతి ఒకవైపు.. బీఆర్ఎస్వీ మరోవైపు కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో ఆధిపత్యపోరు అన్నాచెల్లెళ్ల సవాల్ అన్నట్లుగా మారిందనే చర్చ నేతల్లో నడుస్తోందట. జాగృతి సంస్థను కవిత స్థాపించగా, బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వీ ఉంది…పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా…ఒకే రోజు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడంతో పార్టీ కేడర్ లో మాత్రం గందరగోళానికి తెరదీసిందట.
విద్యార్థి విభాగం నేతలతో కేటీఆర్ కార్యాచరణ
బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, కవిత ఇద్దరు కీలకనేతలు. ఇద్దరూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారసులే… అయినప్పటికీ పార్టీ ఎమ్మెల్సీగా కవిత ఉన్నప్పటికీ సొంత జాగృతి సంస్థ బలోపేతంపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ జాగృతి ఆధ్యర్యంలోనే కార్యక్రమాలు చేపడుతూ యాక్టివ్ అవుతున్నారు. కేటీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టిసారించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ విద్యార్థి విభాగం నేతలను పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న లీడర్ కార్యక్రమం
అయితే ఒకేరోజూ ఇటు జాగృతి శిక్షణ తరగతులు, అటు బీఆర్ఎస్వీ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వేదికలు వేర్వేరు ప్రాంతాలు అయినప్పటికీ ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు కల్వకుంట్ల వారసులు ప్రకటించారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే లీడర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత రెండు సెషన్లుగా నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు బీఆర్ఎస్వీ సదస్సుకు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ముఖ్య నేతలు హాజరై రెండు సెషన్లలో పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. ఇది ఇప్పుడు గులాబీ పార్టీలోనే చర్చకు దారితీస్తుందట.
యువత, విద్యార్థులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కవిత యాక్షన్ ప్లాన్
ఎందుకు ఒకేసారి అన్నచెల్లెలు ఒకే సారిప్రోగ్రాంలను ఫిక్స్ చేశారు? అసలు కారణం ఏంటి? ఒకరు ఒక తేదీలో.. మరొకరు ఇంకో తేదీలో శిక్షణ తరగతులు నిర్వహించవచ్చుకదా? అన్న చర్చ ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. ఆ క్రమంలో అసలు పార్టీలో ఏం జరుగుతుందనేది తెలియక కేడర్ లో అయోమయం నెలకొందట. కవిత యువత, విద్యార్థులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికలతో జాగృతిని యాక్టివేట్ చేయాలని చూస్తున్నారు. యువత, మహిళలు, బహుజనులు రాజకీయాల్లో రావాలని ప్రతీ సందర్భంలోనూ పిలుపునిస్తున్నారు. అందులో భాగంగానే జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయశిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టారు. తొలుత రాష్ట్రస్థాయిలో ‘లీడర్’ పేరుతో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 26న మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో గల శ్రీ కన్వెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే ఆ కార్యక్రమాన్ని ఆమె గత నెల 15వ తేదీన ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి జాగృతి ప్రతినిధులు రావాలని పిలుపు నిచ్చారు.
ఫాంహౌస్‌కే పరిమితమవుతున్న మాజీ సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ ఓటమి తర్వాత గులాబీ బాస్ ఫాంహౌస్‌కే పరిమితమవుతున్నారు. దాంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పార్టీని నడిపిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ముఖ్యులందరికీ కేసుల చట్రం బిగుసుకుంటుండటంతో… చిన్నబాస్‌కు పార్టీ నేతల సహకారం కూడా పూర్తి స్థాయిలో లభించడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంద. అయినా తనదైన వ్యూహాలు అమలు చేస్తున్న కేటీఆర్ బనకచర్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను బీఆర్ఎస్వీకి అప్పగిస్తూ తాజా కార్యక్రమానికి రూపకల్పన చేశారు…
విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం
అందుకు తగ్గట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యచరణ సిద్ధంచేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై జంగ్ సైరన్ మోగించేందుకే ఈ నెల 19 నుంచి విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 26న ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్వీ విభాగం రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ ప్రోగ్రాం ఉదయం సెషన్ ను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభిస్తుండగా… సాయంత్రం సెషన్ లో కేటీఆర్ పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో నష్టాలు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని చూస్తున్నారు.
పార్టీనే ప్రాణమంటున్న అన్నాచెల్లెలు
కల్వకుంట్ల అన్నాచెల్లెల్లు ఇద్దరూ ఎవరికి వారే పార్టీ తమకు ప్రాణం అంటూనే .. ఎవరికి వారు సొంతంగా యాక్షన్‌ప్లాన్లు ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరు ప్రత్యక్షంగా ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకోపోతున్నా… ఎవరికి వారు సొంత కార్యచరణ నడిపించడానికి చూస్తుంటే … దానిపై కేసీఆర్ మౌనంగానే ఉంటూ ఫాంహౌస్‌కే పరిమితమవుతున్నారు. ఆ క్రమంలో తాజాగా ఈ పోటాపోటీ శిక్షణ కార్యక్రమాలు గులాబీ పార్టీని మనుగడను మరింత డైలమాలోకి నెట్టేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Story By RamiReddy, Bigtv