Investopia Global Summit 2025: తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ కలను నిజం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి, పట్టుదలతో సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ హిటెక్స్ సెంటర్‌లో ప్రారంభమైన ఇన్వెస్టోపియా గ్లోబల్ సమిట్‌లో రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి దిశగా జరుగుతున్న పరిణామాలను వివరించారు. యూఏఈ పారిశ్రామికవేత్తలు తెలంగాణతో భాగస్వామ్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “తెలంగాణ భౌగోళికంగా చిన్నదైనా, లక్ష్యాలు మాత్రం గొప్పవే. తక్కువ కాలంలోనే ఫీనిక్స్ పక్షిలా అభివృద్ధి సాధించింది. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందని తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర GSDP వృద్ధి 8.2%గా నమోదైంది. ఇది దేశ సగటు వృద్ధి రేటు 7.6% కంటే ఎక్కువ. రాష్ట్రం జాతీయ GDPలో 5% కంటే ఎక్కువ వాటా అందిస్తోంది. ఈ గణాంకాలు తెలంగాణ వేగవంతమైన అభివృద్ధి దిశగా వెళ్తోందని స్పష్టంగా చూపిస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పరిశ్రమల విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. డ్రై పోర్టులు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, EV జోన్లు, నెట్-జీరో పార్కులు, గ్రీన్ లాజిస్టిక్స్ హబ్‌లు, ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) మరియు మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్టులు పరిశ్రమలకు మరింత ఊపు ఇస్తున్నాయని శ్రీధర్ బాబు వివరించారు. ఈ ప్రాజెక్టులు అమలు completed అయితే తెలంగాణ పెట్టుబడిదారులకు ప్రధాన కేంద్రంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణను భవిష్యత్తులో గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చడానికి ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్ కీలకం కానుంది. ఫిన్‌టెక్, క్లైమేట్ టెక్, స్మార్ట్ మొబిలిటీ ఇన్నోవేషన్స్ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి జరుగుతోంది. AI ల్యాబ్స్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), డేటా సెంటర్లు, ఏరోస్పేస్ క్లస్టర్లు.. ఇవన్నీ రాష్ట్రాన్ని టెక్నాలజీ కేంద్రంగా నిలుపుతున్నాయి.
గత 18 నెలల్లోనే తెలంగాణలో రూ. 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం రాష్ట్ర పరిశ్రమల శక్తిని సూచిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో యూఏఈకి తెలంగాణ ఎగుమతులు 2.5 రెట్లు పెరిగాయి. ఫార్మా, ఏరోస్పేస్, డిజిటల్ సర్వీసులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు ఈ వృద్ధిలో కీలకపాత్ర పోషించాయి. లూలూ గ్రూప్, డీపీ వరల్డ్, నాఫ్కో వంటి ప్రముఖ యూఏఈ కంపెనీలు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం రేవంత్ రెడ్డి విజన్‌ను మరింత బలపరుస్తోంది.
ఈ ఇన్వెస్టోపియా సమ్మిట్ అనేది పాత స్నేహితుల పునర్మిళకలాంటిది. యూఏఈలా తెలంగాణ కూడా సమయాన్ని, నమ్మకాన్ని, మార్పును విలువైనవిగా భావిస్తుందని శ్రీధర్ బాబు అన్నారు. ఈ సమ్మిట్‌లో యూఏఈ ఎకానమీ టూరిజం మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీ, తెలంగాణ IT ఇండస్ట్రీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, TSIIC MD కే శశాంక్, యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండర్ సెక్రటరీ మొహమ్మద్ అల్ వాహైబి, యూఏఈ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ వాలీద్ హారెబ్ అల్ ఫలాహి, ఇన్వెస్టోపియా CEO జీన్ ఫారెస్ పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తెలంగాణ అభివృద్ధి కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ప్రతి పౌరుడు గర్వపడే విధంగా రాష్ట్రం ఎదుగుతూ ఉండటం ఆనందకర విషయం. రాబోయే సంవత్సరాల్లో పెట్టుబడులు, ఎగుమతులు, సాంకేతికత, మౌలిక సదుపాయాల కలయికతో తెలంగాణను ఒక బ్రాండ్‌గా మార్చాలనే లక్ష్యం ప్రభుత్వానికి ఉందని మంత్రి స్పష్టంగా చెప్పారు.