Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక హెలీకాప్టర్ లో ఆలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ కు స్థానిక నేతలు, అధికారులు స్వాగతం పలికారు. కొండగట్టు ఆలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ కు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కొండగట్టు అంజన్నకు పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు పవన్. ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించారు.
ఈ పర్యటనలో రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి పవన్ కల్యాణ్.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం నాచుపల్లి శివారులోని ఓ రిసార్ట్‌లో జనసేన కార్యకర్తలతో సమావేశమై మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణమవుతారు. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో.. కొండగట్టుకు జనసేన కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పవన్ పర్యటన సందర్భంగా కొండగట్టుకు గబ్బర్ సింగ్ టీమ్ కూడా వచ్చింది.
“కొండగట్టు అంజన్న నాకు పునర్జన్మను ఇచ్చాడు అని చాలా సందర్భాల్లో చెబుతుంటాను. ఆ రోజు ఆ ప్రమాదం జరిగినప్పుడు పక్కనే ఉన్న ప్రత్యక్ష సాక్షి నా చిరకాల మిత్రుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈ కొండగట్టు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందడం నాకు మరింత ఆనందంగా ఉంది”– డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Also Read: పవన్ హామీ నెరవేర్చిన టీటీడీ.. కొండగట్టులో రూ.35.19 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సభా స్థల ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు చేశారు. శనివారం కొండగట్టుకు వచ్చిన కలెక్టర్ హెలిప్యాడ్, శిలాపలకం, గుడి ఆవరణ ప్రదేశంలో ఏర్పాట్లను పరిశీలించారు. పవన్ పర్యటన నేపథ్యంలో కొండగట్టు ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు, పోలీసు బందోబస్త్ ఉంటుందని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు సంయమనం పాటించాలని కోరారు.