Telangana Economy: స్వేచ్ఛ బ్యూరోొ: ‘వికసిత్ భారత్ – 2047’ లక్ష్య సాధనలో తెలంగాణ అత్యంత కీలకమైన భాగస్వామ్య పాత్ర పోషించేందుకు పూర్తి సన్నద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దేశం నిర్దేశించుకున్న భారీ ఆర్థిక లక్ష్యాలను సుదూర ఆశయాలుగా కాకుండా, తక్షణ కార్యాచరణ బాధ్యతగా తెలంగాణ భావిస్తోందని చెప్పారు.కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో శనివారం నిర్వహించిన ‘వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి ఆర్థిక వనరుల సమీకరణ’ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య ప్రసంగం చేశారు.
ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రైవేట్ పెట్టుబడులు, సంస్థాగత నిధులు,సావరిన్ ఫండ్స్ నుంచి భారీగా పెట్టుబడులు సమీకరించి, ప్రభుత్వ నిధులను వ్యూహాత్మకంగా ఉపయోగించే నమూనాను తెలంగాణ అమలు చేస్తోందన్నారు. పీపీపీ గ్రీన్ బాండ్లు, బ్లెండెడ్ ఫైనాన్స్ విధానాలను బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు.
2025-26లో తెలంగాణ జీఎస్ డీపీ రూ.17.82 లక్షల కోట్లకు చేరిందని, ప్రస్తుత ధరల ప్రకారం 10.7 శాతం వృద్ధి నమోదు చేసిందన్నారు. తలసరి ఆదాయం రూ.4,18,931 సాధించి జాతీయ సగటు (రూ.2,19,575) కంటే రెండింతల పురోగతి చూపిందన్నారు. ప్రస్తుతం ఉన్న వృద్ధి రేటు ప్రకారం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 1.21 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, అయితే ప్రభుత్వం మరింత పెద్ద లక్ష్యంతో తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సంకల్పించిందని ప్రకటించారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను 5 శాతం నుంచి 10 శాతానికి పెంచడమే తమ దార్శనికత అని వివరించారు.
Also read: తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?
రాష్ట్రవ్యాప్తంగా సమతుల్య అభివృద్ధి కోసం ప్రత్యేక ఆర్థిక ప్రాంతాల నమూనాను రూపొందించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. క్యూర్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా ఏఐ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఫిన్‌టెక్, లైఫ్ సైన్సెస్, నాలెడ్జ్ ఆధారిత పరిశ్రమలకు హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇక ప్యూర్ పరిధిలో ప్రధాన రవాణా మార్గాల వెంట తయారీ, పారిశ్రామిక రంగాలను డెవలప్ చేస్తున్నామన్నారు. రేర్ పరిధిలో డిజిటల్ అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు, కోల్డ్‌చైన్ వ్యవస్థల ద్వారా గ్రామీణ ఉత్పత్తిదారులకు గ్లోబల్ మార్కెట్ అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.
దేశంలో భవిష్యత్ నగరాలకు మోడల్‌గా 30 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో భారత్ ప్యూచర్ సిటీని మొదటి నెట్-జీరో, ఏఐ ఆధారిత గ్రీన్ మెగాసిటీగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు, క్లీన్ టెక్నాలజీ పార్కులు ఇందులో భాగమవుతాయని చెప్పారు. ఈ ప్రాంతాలను అనుసంధానించేందుకు రీజినల్ రింగ్ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇక మానవ వనరులే నిజమైన శక్తి అని, యువత నైపుణ్యాలను పెంచేందుకు అంతర్జాతీయ భాగస్వామ్యంతో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసి పనిచేస్తే వికసిత్ భారత్ లక్ష్యం సులభంగా సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.
Also read: మానవ మెదడుపై స్టాన్‌ఫోర్డ్ సంచలన పరిశోధన.. వెలుగులోకి షాకింగ్ ఫ్యాక్ట్స్?