Balmuri Venkat: సిఎల్పీ మీడియా హాల్ వేదికగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ , హరీష్ రావులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన వందల ఎకరాల భూ అక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా సభలో బయటపెట్టారని ఆయన పేర్కొన్నారు.
ఫామ్‌హౌస్, సిరిసిల్ల భూముల మాయాజాలం
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఓవర్‌లాప్ అయిన భూములు ఎక్కడి నుంచి వచ్చాయో కేటీఆర్ సమాధానం చెప్పాలని వెంకట్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏకంగా 8 వేల ఎకరాల అక్రమ దందా జరిగిందని, గతంలో పనిచేసిన కలెక్టర్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారని గుర్తుచేశారు. బాలానగర్‌లోని టీఎమ్33 భూములు హరీష్ రావు మామ, మరొక వ్యక్తి పేరిట బదిలీ అయ్యాక వాటిని కంపెనీ పేరిట మార్చారంటూ హరీష్ రావు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.
అఫిడవిట్లలో తేడాలు, దొంగ పాస్‌పోర్ట్ దందా
2009 ఎన్నికల అఫిడవిట్‌లో లేని ఆస్తులు 2023 నాటికి 60 ఎకరాలకు ఎలా పెరిగాయో కేటీఆర్ స్పష్టం చేయాలన్నారు. షేక్‌పేట్, పుప్పాలగూడ, అల్వాల్ ప్రాంతాల్లో వీరికి 15 లక్షల చదరపు అడుగుల ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్‌కు ‘దుబాయ్ శేఖర్’ అనే పేరు ఎందుకు వచ్చిందో గూగుల్‌ని అడిగినా చెబుతుందని ఎద్దేవా చేశారు. భూస్వాములమని చెప్పుకునే వీరు గతంలో దొంగ పాస్‌పోర్ట్ దందా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
అసలు ఆస్తుల విచారణకు సిద్ధమా?
ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు కేవలం ‘ఉల్లిగడ్డ మీద పొట్టు’ లాంటివి మాత్రమేనని, అసలు నిజాలు బయటకు రావాలంటే తక్షణమే పూర్తిస్థాయి సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి పెయింటింగ్ పనులు చేశారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. రేవంత్ రెడ్డి 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడారని స్పష్టం చేశారు. వారి వద్ద ఏమీ లేవు కాబట్టే రేవంత్ రెడ్డి సతీమణి స్వయంగా వెళ్లి లాకర్ తెరిచి చూపించారని, ధైర్యముంటే కేసీఆర్ కుటుంబం కూడా తమ భూములపై విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.
Also Read: బద్వేల్ లో స్కూటీ రగడ.. పక్కా ప్లాన్‌తో అన్నదమ్ములపై కత్తితో దాడి!