Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ కోఠిలోని వివేక్ వర్ధిని కళాశాలలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవం, రాష్ట్ర రాజకీయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ దృఢ సంకల్పం వల్లే తెలంగాణకు నిజాం రజాకార్ల దౌర్జన్యాల నుంచి విముక్తి లభించిందని ఆయన గుర్తుచేశారు. కానీ, నేటి కాంగ్రెస్, నిన్నటి బీఆర్ఎస్ పాలకులు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే నిజాం అక్రమాలను విస్మరించి, అతడిని పొగడటం సిగ్గుచేటని మండిపడ్డారు. నిజాం పాలనలో బలైన వీరుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చేది బీజేపీనే..
రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్, తాము అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన ఉత్సవాలను వారం రోజుల పాటు ప్రతీ గల్లీలో అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. పరకాల, గుండ్రాంపల్లి, వీర బైరాన్ పల్లి, నిర్మల్ వెయ్యి ఊడల మర్రి వంటి చారిత్రాత్మక పోరాట ప్రాంతాలను ప్రసిద్ధ స్ఫూర్తి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నిజాంను పొగిడినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు..
భూదోపిడీ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి నాటకాలాడుతున్నాయని సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం చేసిన భూదోపిడీకి తగిన ఆధారాలు ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా సిట్ పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలోని ఏఐసీసీకి ఈఎంఐలు కట్టడానికే సీఎం రోజుకో కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కబ్జా చేసిన భూములను బీజేపీ స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతుందని, 2014 ఎన్నికల అఫిడవిట్లపై సిట్టింగ్ జడ్జితో జ్యూడీషియల్ విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Also Read: మెట్రో పార్కింగ్.. గోల్ మాల్? రూ.వేల కోట్లలో స్కామ్?