Metro Parking Scam: హైదరాబాద్ మెట్రో పార్కింగ్ కు సంబంధించి రూ.1000 కోట్ల స్కామ్ ను బిగ్ టీవీ బయటపెట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనంతంటికి సంబంధించి తెరపై కనిపిస్తున్నది రమణారెడ్డి ఒక్కరే. కానీ ఆయన నడిపిస్తున్న ఈ రూ.వేల కోట్ల దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అసలు ప్రయాణికుల సదుపాయం కోసం కేటాయించిన మెట్రో పార్కింగ్ స్థలాలను, అప్పనంగా ఒకే ఒక్క వ్యక్తికి ఎలా కట్టబెట్టారు? 2018లో అసలు ఎంతమంది బిడ్డింగ్ వేశారు? ఏ ప్రాతిపదికన ‘జృతి సొల్యూషన్స్’ అనే సంస్థకు రూపాయి ఫీజు కూడా లేకుండా ఉచితంగా లీజు ఇచ్చారు? అప్పటి మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డి గారు సంతకం పెట్టిన ఆ ఫైలు వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి? అన్న ప్రశ్నలు ఇప్పుడు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి.
2018లో తొలిసారి మెట్రో పార్కింగ్‌కు బిడ్డింగ్ వేయగా.. రమణారెడ్డికి చెందిన జృతి సొల్యూషన్స్ ఉచితంగా లీజు లభించింది. ఇది యాదృచ్చికమని కొద్దిసేపు భావించినా.. 2021లో మళ్లీ బిడ్డింగ్ జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా ఈసారి కూడా లీజు దక్కింది రమణారెడ్డికి చెందిన ఆ సంస్థకే. ఈసారి ఏకంగా 55 మెట్రో స్టేషన్లు, 20కి పైగా విలువైన ఓపెన్ ల్యాండ్స్‌ను ఏడాదికి కేవలం 27 లక్షల రూపాయల అద్దెకే కట్టబెట్టేశారు. అమీర్‌పేట్, రాయదుర్గం, LB నగర్, JBS వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లోని పార్కింగ్ స్థలాలను 20 ఏళ్ల పాటు.. మరో 20 ఏళ్లకు పొడిగించుకునేలా పకడ్బందీగా అగ్రిమెంట్ రాసివ్వడం అనుమానాలకు తావిస్తోంది.
నెలకి 3 లక్షల లోపు అద్దె కడుతూ.. రోజుకి 10 లక్షల రూపాయల చొప్పున, నెలకి 3 కోట్ల పైనే జేబులో వేసుకుంటున్నారు రమణారెడ్డి. అంటే 20 ఏళ్లలో ఏకంగా 1,000 కోట్లకు పైగా అక్రమ సంపాదన. ఒకవైపు మెట్రో, ప్రభుత్వం నష్టాల్లో ఉంది. కానీ రమణారెడ్డి మాత్రం కోట్లు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రమణారెడ్డికి అప్పనంగా పార్కింగ్ లీజు ఇచ్చే విషయం.. మెట్రో ఎండీ NVS రెడ్డికి తెలియకుండానే జరిగిందా? లేక అప్పటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు, ఒత్తిళ్లు ఈ ఒప్పందాల వెనుక ఉన్నాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
మియాపూర్, నాగోల్‌లో ప్రయాణికుల పార్కింగ్ కోసం ఎల్ అండ్ టీ సంస్థ ఇచ్చిన 9 ఎకరాల స్థలాన్ని కూడా రమణారెడ్డి సంస్థలకే లీజుకు ఇచ్చారు. అసలు నిబంధనల ప్రకారం మెట్రో ప్రయాణికుల వాహనాలు తప్ప మరేవీ ఇక్కడ పార్క్ చేయకూడదు. సబ్-లీజులకు అసలే ఇవ్వకూడదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి మియాపూర్ 5 ఎకరాల స్థలాన్ని అడ్డగోలుగా ప్రైవేట్ కాలేజీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు అద్దెకు ఇచ్చేశారు. ఒక్కో బస్సు నుంచి నెలకు 8 వేలు వసూలు చేస్తూ రోజుకి 500 బస్సులతో నెలకు రూ. 40 లక్షలు ఆర్జిస్తున్నారు. ఒప్పందంలో ఉన్న స్థలం కన్నా ఎక్కువ భూమిని వాడుకుంటున్నా… అధికారులకు కనబడట్లేదా? లేక చూసీచూడనట్లు నటిస్తున్నారా?
Also Read: మెట్రో పిల్లర్ల కింద గుంతలు.. అధికారులకు కాల్ చేస్తే.. లైవ్‌లోనే కడిగిపారేసిన బిగ్ టీవీ రిపోర్టర్లు!
ఇచ్చిన సంస్థకే సబ్-లీజులు ఇవ్వకూడదనే కఠినమైన రూల్ ఉన్నా.. మెట్రో ఉన్నతాధికారులకు అది కనపడలేదా? వారి మద్దతు లేకుండానే ఇది సాధ్యమేనా? అసలు రమణారెడ్డి అనే వ్యక్తి వెనుక ఉన్న ఆ బడా రాజకీయ నాయకులు ఎవరు? మెట్రో ఆస్తులను చౌకబారుగా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసిన ఆ ‘పెద్ద మనషుల’ అసలు రంగు బయటపడేది ఎప్పుడు?
Also Read: రాయిలా నటిస్తూ.. ప్రపంచాన్నే బురిడి కొట్టిస్తున్న అరుదైన మెుక్క.. ఏమన్నా తెలివా?