Preethi Reddy: స్వేచ్చ బ్యూరో: బర్త్‌డే వేడుకలు రాజకీయ వివాదానికి దారితీశాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి జన్మదినం సందర్భంగా చింతల్‌లో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, కటౌట్లపై బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని చించివేశారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల ఫోటోలు లేకపోవడమే తమ ఆగ్రహానికి కారణమని కార్యకర్తలు పేర్కొన్నారు.
ప్రీతి రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోటోలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడంపై బీఆర్‌ఎస్ అభిమానులు, నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులను విస్మరించి పక్క నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ఫోటోలను ఏర్పాటు చేయడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు.ఫ్లెక్సీల్లో పార్టీ అధినేతలు, స్థానిక ప్రజాప్రతినిధులకు గుర్తింపు లేకపోతే ఎలా? అంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు స్థానికంగా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరుల ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా భావిస్తున్నామని తెలిపారు.
Also read: మెట్రో పిల్లర్లను తవ్వేస్తున్న అగంతకులు.. ఇటు చూడండి సారు!
ఇదే సమయంలో మల్లారెడ్డి కుటుంబ రాజకీయ వ్యవహారాలపై కూడా కొందరు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత వ్యాపార ప్రయోజనాల కోసం రాజకీయంగా తరచూ వైఖరులు మార్చుకుంటూ స్థానిక పార్టీ నాయకత్వాన్ని విస్మరించడం సరికాదు అంటూ మండిపడ్డారు. స్థానిక నాయకత్వాన్ని పక్కనపెట్టి మరోసారి ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని కొందరు పార్టీ కార్యకర్తలు హెచ్చరించారు. దీంతో చింతల్‌లో ప్రీతి రెడ్డి జన్మదిన ఫ్లెక్సీల చించివేత ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Also read: ప్రతి పైసా లెక్కిస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు