Chamala Kiran Kumar: నీటి అంశాన్ని రాజకీయ లాభాల కోసం వాడుకుంటూ.. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేస్తున్నారని.. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. నీళ్ల గురించి తనకే అన్నీ తెలుసన్నట్లుగా హరీష్ రావు మాట్లాడుతున్నారని, టీఎంసీలు, క్యూసెక్కులపై ఒక్కడికే అవగాహన ఉన్నట్లు ఫీల్ అవుతున్నారని చామల కిరణ్ రెడ్డి ఎద్దేవా చేశారు.
నీటి అంశాన్ని తెలంగాణ సెంటిమెంట్‌గా మలిచి మళ్లీ అధికారంలోకి రావాలన్న భ్రమల్లో.. హరీష్ రావు జీవిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అసత్య ప్రచారం చేయడమే బీఆర్ఎస్ అజెండాగా మారిందని మండిపడ్డారు. వాస్తవాలను పక్కనపెట్టి ప్రజలను గందరగోళానికి గురి చేయడం రాజకీయ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దక్షిణ తెలంగాణలో కృష్ణా నదిపై గత కాంగ్రెస్ ప్రభుత్వం, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని చామల కిరణ్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా నది తెలంగాణ భూభాగంలో 69 శాతం ప్రవహిస్తున్నా, మొత్తం 812 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సరిపోతాయని కేసీఆర్, హరీష్ రావు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. నిజంగా నీటి హక్కులపై చిత్తశుద్ధి ఉంటే అప్పుడే సీడబ్ల్యూసీ ముందు ధర్నా చేసి పోరాడాల్సిందని విమర్శించారు.
పదేళ్లలో గాడిద పళ్ళు తోమారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన చామల కిరణ్ రెడ్డి, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పాత కాంట్రాక్టర్లు ఉంటే కమీషన్లు రావని, అందుకే కొత్త టెండర్లు పిలిచారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టిని పక్కనపెట్టి గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడమంతా కేవలం కమీషన్ల కోసమేనని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు గోదావరి, బనకచర్ల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పేరుతో.. ప్రజలను హరీష్ రావు కావాలనే కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ నీటి హక్కుల ప్రకారం కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు 500 టీఎంసీలకు పైగా రావాల్సిన హక్కు ఉందని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుపై జనవరి 5న సుప్రీంకోర్టులో విచారణ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ అంశాన్ని కూడా సెంటిమెంట్‌గా వాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అన్నారు.
చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని చెప్పుతూ.. రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ డ్రామాలను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనిస్తున్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను పదేళ్ల పాటు మోసం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
రాయలసీమను రతనాల సీమ చేస్తానన్న మాటలు ఎవరు చెప్పారో, బేసిన్లు, భేషజాలు లేవన్న ప్రకటనలు ఎవరివో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. 3 వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని అన్నది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి చేపల పులుసు తిని మీరు ఏమైనా చేసుకోండి అని కేసీఆర్ అన్న మాటలు ప్రజలు మర్చిపోలేదన్నారు.
బనకచర్లకు మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని, ఆ ప్రాజెక్టుకు ఆద్యం పోసింది కూడా బీఆర్ఎస్ేనని చామల కిరణ్ రెడ్డి తెలిపారు. తమకు కృష్ణా, గోదావరి నదీ జలాలపై పూర్తి చిత్తశుద్ధి ఉందని, కృష్ణా నదిలో పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎంత ఉందో అంత వాటా కావాలని సీఎం రేవంత్ రెడ్డి పోరాడుతున్నారని స్పష్టం చేశారు.
బనకచర్లపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి వద్ద జరిగిన సమావేశంలో హరీష్ రావు ఉన్నారా? అని ప్రశ్నించిన ఆయన, ఎంపీగా తాను ఆ సమావేశంలో పాల్గొన్నానని చెప్పారు. ఆ భేటీలో టెలిమెట్రీ విధానం, కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మత్తులపై కీలక నిర్ణయాలు జరిగాయని వెల్లడించారు. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణలో, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏపీలో ఉండేలా నిర్ణయించినట్లు తెలిపారు.
కేంద్ర మంత్రి వద్ద బనకచర్లపై ఎలాంటి చర్చ జరగలేదని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. బనకచర్ల అంశాన్ని తెలంగాణ సెంటిమెంట్‌కు వాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. విభజన హామీల అమలుతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్‌పై పార్లమెంటులో పోరాటం చేస్తున్నామని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.