BigTV English

BJP: తెలంగాణపై త్రిశూల వ్యూహం!.. కేసీఆర్‌పై కాషాయ దండయాత్ర..

BJP: తెలంగాణపై త్రిశూల వ్యూహం!.. కేసీఆర్‌పై కాషాయ దండయాత్ర..
BJP kcr

Telangana BJP latest news(TS politics) : కర్నాటక పోయింది. ఇక తెలంగాణే మిగిలింది. పోయిన పరువు దక్కాలంటే.. తెలంగాణలో తప్పక గెలవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు కమలనాథులు. లేదంటే, దక్షిణాదిన పార్టీ ఉనికే లేకుండా పోతుంది. అందుకే, బీజేపీ అగ్రనేతలంతా ఇప్పుడు తెలంగాణపైనే ఫోకస్ చేశారు. మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు.. వరుస పర్యటనలకు సిద్ధమవుతున్నారు.


ఎంపీ అసదుద్దీన్ ఇటీవలే చెప్పారు. అమిత్ షా ఇక నెలలో 2 రోజులు హైదరాబాద్‌లోనే ఉండనున్నారని. ఆయన కోసం ఓ బడా వ్యాపారవేత్త ఇల్లు కూడా కట్టించాడని. ఇంకేం, కమల చాణక్యుడు షానే.. తెలంగాణకు వచ్చి తిష్ట వేస్తే? ఇక మామూలుగా ఉండదు మరి రాజకీయం.

2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో.. దేశంలోకే అతిపెద్ద రాష్ట్రమైన యూపీ బాధ్యతలను స్వీకరించారు అమిత్‌షా. అప్పుడు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో లేదు. వరుసగా కొన్ని నెలల పాటు యూపీలోనే మకాం వేసిన షా.. ఆ సార్వత్రిక ఎన్నికల్లో 71 ఎంపీ స్థానాలను కొల్లగొట్టారు. బీజేపీకి తిరుగులేని విజయం సాధించిపెట్టారు. యూపీలో ఇప్పటికీ కాషాయ జెండానే ఎగురుతోంది. అట్లుంటది అమిత్‌షా తోని.


అలాంటి షా.. ఇప్పుడు నెలలో రెండు రోజులు హైదరాబాద్‌లోనే మకాం వేయబోతున్నారంటే? కేసీఆర్‌కు గుండె గుబేల్ అనిపించే విషయమే. షా ఒక్కరే కాదు.. మోదీ, నడ్డాలు సైతం తెలంగాణకు ఇకపై రెగ్యూలర్ విజిటర్స్ కానున్నారట. గెలుపే లక్ష్యంగా.. ఇకపై తరుచూ రాష్ట్ర పర్యటనలు చేయనున్నారని తెలుస్తోంది.

కమలనాథులు మొదటి సభ ఈ నెల 15న ఖమ్మంలో జరగనుంది. ఈ భారీ బహిరంగ సభకు అమిత్ షా రానున్నారు. ఖమ్మంమే ఎందుకు? అంటే.. ఇటీవల బీఆర్ఎస్ ఖమ్మంలోనే తొలి జాతీయ బహిరంగ సభ నిర్వహించింది. ఢిల్లీ, పంజాబ్ సీఎంలను, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌, కామ్రేడ్లను రప్పించి.. గులాబీ బలప్రదర్శణ చేశారు. అందుకే, అదే ఖమ్మంలో కాషాయ బలగంను ప్రదర్శించేలా జూన్ 15న భారీ మీటింగ్ తలపెట్టింది బీజేపీ.

ఖమ్మంలోనే సభ పెట్టేందుకు మరో కారణం కూడా ఉందంటున్నారు. జిల్లాలో బలమైన నాయకుడుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని.. బీజేపీలోకి రారమ్మని ఎంతగా బతిమిలాడుకున్నా.. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకే సిద్ధమయ్యారు. అందుకే, పొంగులేటి ఇలాఖాలోనే సభ పెట్టి.. కాషాయ పార్టీ పవర్ ఎంతో చూపించాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ‘మహా జన్ సంపర్క్ అభియాన్’ పేరిట ఖమ్మంలో అమిత్ షా సభ జరగనుంది.

ఇక, మరో 10 రోజుల గ్యాప్‌లో.. జూన్ 25న నాగర్ కర్నూల్‌లో ఇంకో బహిరంగ సభను తలపెట్టింది బీజేపీ. ఆ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. అటు.. ఈ నెలాఖరు వరకూ ప్రధాని మోదీ సైతం హైదరబాద్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మల్కాజ్‌గిరిలో మోదీచే అత్యంత భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలోనూ సభ పెట్టి.. మోదీ హాజరయ్యేలా షెడ్యూల్ రెడీ చేస్తున్నారు కమలనాథులు.

కర్నాటక ఓటమితోనే అగ్రనేతలంతా ఇలా తెలంగాణపై దండయాత్రకు సిద్ధమయ్యారని.. కేసీఆర్‌తో తాడోపేడో తేల్చుకోనున్నారని అంటున్నారు. మరి, కమలదళం దూకుడును గులాబీ దళం ఎలా అడ్డుకుంటుందో? మధ్యలో కాంగ్రెస్ ఏం చేస్తుందో?

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×