“కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి నాయకత్వం వహించాలంటే, ఆ జైత్రయాత్ర జూబ్లీ హిల్స్ నుంచే మొదలు కావలి.” తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చెప్పిన మాటలివి. సరిగ్గా లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా ఆయన ఇవే డైలాగులు కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేశామని భావిస్తున్న తెలంగాణ ప్రజానీకం లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి పట్టం కట్టబోతోందని, రాబోయే మార్పుకి ఇదే నాంది అని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ ఖాయం అన్నారు. సీన్ కట్ చేస్తే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్కోర్ జీరో. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవం కంటే రెట్టింపు చూడాల్సి వచ్చింది. మరిప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సంగతేంటి? ఇప్పుడు కూడా అదే పరాభవం రిపీట్ కాదని గ్యారెంటీ ఏంటి?
ఓటమి తప్పదని తెలిసినా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ తో గెలవాలని అనుకుంటోంది బీఆర్ఎస్. అందుకే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబంలో ఒకరికి టికెట్ ఇవ్వాలనుకుంటోంది. అది కూడా అధికారికం కాదు. ఇటు కాంగ్రెస్ కూడా ఎలాగైనా ఆ స్థానంలో పాగా వేసి అసెంబ్లీలో మరో సీటు దక్కించుకోవాలనుకుంటోంది. ఒకరకంగా కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆశావహుల పోటీ కూడా కాంగ్రెస్ లో తీవ్రంగా ఉంది. ఈ దశలో బీఆర్ఎస్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. లోక్ సభ ఎన్నికల సమయంలో ఎంతలా హడావిడి చేసిందో ఇప్పుడు అంతకు మించి హడావిడి మొదలు పెట్టింది. జూబ్లీహిల్స్ నాయకులతో సమావేశాలు స్టార్ట్ చేసింది.
Live: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం.
📍 తెలంగాణ భవన్ https://t.co/90x2gCrimJ
— BRS Party (@BRSparty) September 15, 2025
కవిత శాపం తగులుతుందా?
కవితను బయటకు సాగనంపిన తర్వాత బీఆర్ఎస్ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని కవిత కోరుకుంటోంది. ఈ ఓటమిని చూపించి పార్టీలో ఉన్నవారంతా అసమర్థులేనని తీర్మానించాలనుకుంటోంది. అదే సమయంలో కేటీఆర్ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ లోకి ఫిరాయించారని అంటున్న ఎమ్మెల్యేల స్థానాల్లో కూడా బీఆర్ఎస్ ఉప ఎన్నికలు కోరుతోంది. జూబ్లీహిల్స్ లో గెలిస్తే అది తమకు ఊరటనిస్తుందని అనుకుంటున్నారు కేటీఆర్. ఒకవేళ ఈ ఎన్నిక కూడా పోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు పట్టు ఉండదనేది ఆయన బాధ. వాస్తవానికి గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ కి బలం లేదు. సెటిలర్ల విషయంలో ఆ పార్టీ నాయకులు రకరకాల వ్యాఖ్యలు చేస్తుంటారు. మాగంటి గోపీనాథ్ లాంటి నేతలు కూడా బలవంతంగానే బీఆర్ఎస్ లోకి వెళ్లారు. అక్కడ నాయకుల సొంత బలం ఉంది కానీ, బీఆర్ఎస్ కి సరైన కార్యకర్తల బలం లేదు. ఈసారి కూడా సెంటిమెంట్ తోనే గట్టెక్కాలనేది కేటీఆర్ ఆలోచన. ఆ ప్లాన్ వర్కవుట్ కాకపోతే, కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పలేని పరిస్థితి వస్తుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని నిరూపించాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి చాటాలి. అందుకే కేటీఆర్ తెగ ఇదైపోతున్నారు. అన్న సంగతేంటో తేల్చేయాలని కవిత కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సొంతగా అభ్యర్థిని బరిలో దింపి బీఆర్ఎస్ ఓట్లు చీల్చాలని కవిత ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.